Siva Karthikeyan: మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్ సినిమాల్లో రాణించలేరన్నారు.. హీరోగా సక్సెస్ అయ్యా
ABN, Publish Date - Oct 06 , 2026 | 06:25 AM
మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్ సినిమాల్లో రాణించలేరంటూ హేళన చేశారని, కానీ, తాను నటుడిగా విజయం సాధించానని హీరో శివకార్తికేయన్ అన్నారు.
మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్ సినిమాల్లో రాణించలేరంటూ హేళన చేశారని, కానీ, తాను నటుడిగా విజయం సాధించానని హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) అన్నారు. నగర శివారు ప్రాంతమైన భరణి పుత్తూరులో తన అభిమానులతో శివకార్తికేయన్ ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'విజయ్ సేతుపతి, నేను ఎలాంటి నేపథ్యం లేకుండా సినిమాల్లోకి వచ్చి విజయం సాధించాం. మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్ సినిమాల్లో రాణించలేరంటూ హేళన చేశారు. ఇపుడు నేను నటుడిగా విజయం సాధించాను.
విమర్శకులు ఎపుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ, మనమంతా ప్రేమకోసం కలిసి వున్నాం. మన లక్ష్యం ఏమిటో మనం స్పష్టంగా అర్ధం చేసుకో వాలి. దానిపై మనకు స్పష్టత ఉండాలి. ప్రతి రోజూ కనీసం 15 నిమిషాల పాటు పుస్తకాలు చదవండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. బాగా చదివితే, బాగా సంపాదిస్తాం. కుటుంబమే ప్రథమం అని మీరు గ్రహించాలి. మిగతావన్నీ తర్వాతే వస్తాయి. 'సేయోన్' 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇది అభిమానులకు నచ్చే గొప్ప వినోదాత్మక చిత్రం అవుతుంది' అని పేర్కొన్నారు. తాజాగా శివ కార్తికేయన్ ఫ్యాన్స్ తో చేసిన భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేయడంతో త్వరలోనే ఎస్కే సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు.