Sivakarthikeyan: హిట్ కోసం శివకార్తికేయన్ పాట్లు..
ABN, Publish Date - Feb 06 , 2026 | 06:27 PM
వరుసగా సినిమాలు పరాజయం పాలు కావడంతో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) రూట్ మార్చారు.
Sivakarthikeyan: వరుసగా సినిమాలు పరాజయం పాలు కావడంతో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) రూట్ మార్చారు. యాక్షన్ బాటను వదిలి కొత్త బాట పట్టారు. కలిసొచ్చిన కాంబోలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.
'అమరన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్. ఈ మూవీ తర్వాత ఆయన స్టార్ డమ్ అమాంతంగా పెరిగిపోయింది. తదుపరి చిత్రాలపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తనకు వచ్చిన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడంలో శివకార్తికేయన్ తడబడ్డారు. 'అమరన్' తర్వాత వచ్చిన రెండు సినిమాలు 'మదరాసి', 'పరాశక్తి' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా ‘పరాశక్తి’ సినిమాని అయితే ఆడియెన్స్ ఘోరంగా తిరస్కరించారు. దీంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని శివకార్తికేయన్ నిర్ణయించుకున్నారు.
తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ గురించి శివకార్తికేయన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటికే కథతో పాటు దర్శక నిర్మాతలనూ ఎంపిక చేసినట్లు తెలిపారు. తన ఫ్యాన్స్ అలాగే తానూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా ఇదని చెప్పడంతో ఈ హీరో చేయబోతున్న మూవీ ఏంటా అని అందరూ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
శివకార్తికేయన్ తన 26 వ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారని, కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణ బాధ్యతలను అందుకుందని తెలిపారు. గతంలో వీరి కాంబోలోనే 'అమరన్' మూవీ వచ్చింది. ఈ సినిమా కోసం మరోసారి కమల్ హాసన్ - శివకార్తికేయన్ చేతులు కలిపారు. కాగా ఈ కొత్త చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని సమాచారం. త్వరలోనే కమల్.. తన బ్యానర్ లో శివకార్తీకేయన్ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.