ధురంధర్ ఎఫెక్ట్... ధనుష్ మూవీలోకి సారా!
ABN, Publish Date - Apr 15 , 2026 | 12:49 PM
ధనుష్ కొత్త చిత్రంలో రుక్మిణీ వసంత్ ప్లేస్‌లోకి 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ రాబోతున్నట్టు తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు సమాచారం.
సినీ వైకుంఠపాళిలో ఎవరిని ఎప్పుడు ఏ పాము కాటేస్తుందో... ఏ నిచ్చెన ఎవరిని పైకి తీసుకెళుతుందో ఊహించడం కష్టం. కెరీర్ హాయిగా, జాలీగా సాగిపోతోందని అనుకునేంతలో కొన్ని అవకాశాలు చేజారిపోతుంటాయి. నిస్తేజంగా ఉన్న కొందరిని ఊహించని కొన్ని విజయాలు... హఠాత్తునగా నిచ్చెనలు ఎక్కించేస్తుంటాయి. ప్రస్తుతం రుక్మిణీ వసంత్, సారా అర్జున్ విషయంలో అదే జరుగుతోంది. 'కాంతార 2' సినిమాతో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రుక్మిణీ వసంత్. ఇప్పుడు ఆమె కెరీర్ గ్రాఫ్ బాగుంది. ఎన్టీఆర్, నీల్ మూవీలోనూ రుక్మిణీ వసంత్ నాయికగా చేస్తోంది. అయితే... ఆ క్రేజీ ప్రాజెక్టే... ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిపోయింది. పలుమార్లు ఈ సినిమా షెడ్యూల్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో ఆర్టిస్టుల డేట్స్‌ను సెట్ చేసుకోవడం మేకర్స్‌కు పెద్ద కష్టంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఓ కీలకమైన పాత్రను రుక్మిణీ వసంత్ చేజార్చుకోవాల్సి వచ్చింది.
ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం 'కర' మూవీ చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 30న విడుదల కాబోతోంది. అలానే దీనితో పాటు తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వంలోనూ ధనుష్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో... ఆ స్థానంలోకి సారా అర్జున్ వస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి సారా అర్జున్ (Sara Arjun) తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. బాలనటిగా ఆమె పలు తమిళ చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే యవ్వన ప్రాయంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'లోనూ నటించింది. అయితే... 'ధరుంధర్' మూవీతో సారా అర్జున్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా 'ధురంధర్' ఫ్రాంచైజ్ చిత్రాలు రెండు కలిసి మూడువేల కోట్ల గ్రాస్‌ను సాధించడం చిన్న విషయం కాదు. ఆ సినిమాలలో నటించిన సారా... ఇప్పుడు ధనుష్ సరసన నటించడం అంటే... ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ రేంజ్ పెరుగుతుంది. అయితే... దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.