Sanjjanaa Galrani: విజయ్.. త్రిష.. సంజన గల్రానీ షాకింగ్ కామెంట్స్!
ABN, Publish Date - Aug 20 , 2026 | 01:48 PM
ఆగస్టు 15 సందర్భంగా తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌కు త్రిష సెల్యూట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 15 సందర్భంగా తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్‌కు (vijay) త్రిష (Trisha) సెల్యూట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయంగా విమర్శలు, చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో నటి సంజన గల్రానీ (Sanjjanaa Galrani) స్పందించారు. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని జీర్ణించుకోలేక కొందరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై వేగంగా స్పందిస్తూ, తన పాలనతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారని సంజన ప్రశంసించారు.
ఆమె మాట్లాడుతూ “విజయ్ పాలనపై విమర్శలు చేయడానికి అంశాలు దొరకనప్పుడు.. కొందరు వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఆయన రాజకీయంగా ఎదుగుతున్న తీరును తట్టుకోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలను కేంద్రంగా చేసుకుని రాజకీయ విమర్శలు చేయడం సరైన విధానం కాదు. ఒక వ్యక్తి రాజకీయ పనితీరుపై మాట్లాడకుండా.. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల పై విమర్శలు చేయడం సరైన పద్దతి కాదు' అని అన్నారు. నటి త్రిషపై కూడా సంజన ప్రశంసలు కురిపించారు. త్రిష టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని అన్నారు.
'విజయ్, త్రిషల మధ్య ఉన్న అనుబంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వారి సాన్నిహిత్యాన్ని చూసి ఒక నిర్ణయానికి రావడం సరికాదు. ప్రతి వ్యక్తి వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలి” అని సంజన అన్నారు. అయితే విజయ్-త్రిష అంశంపై సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.