Maa Inti Bangaram: వామ్మో.. వామ్మో.. సమంత ఈ కొత్త యాంగిల్ ఏంటి! ఇదసలు.. ఊహించలా!
ABN, Publish Date - Jan 09 , 2026 | 10:54 AM
సమంత హీరోయిన్ గా నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్ విడుదలైంది. సమంతను నయా అవతార్ లో దర్శకురాలు నందినీరెడ్డి ప్రెజెంట్ చేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఊహించని యాక్షన్ పార్ట్ కూ చోటుంది.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. సమంత అంటే ఇంతవరకూ అందరి దృష్టిలో ఉన్న ఇమేజ్ వేరు. ఈ ట్రైలర్ తో కలిగే ఇమేజ్ వేరే. అమాయకపు కోడలిగా ఓ ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టిన అమ్మాయి... బ్యాక్ స్టోరీని ఈ ట్రైలర్ లో చూపించారు. పైకి అమాయకంగా కనిపించే అమ్మాయి పగ తీర్చుకోవడం కోసమే ఆ ఊరు వచ్చినట్టుగా దీనిని చూస్తుంటే అర్థమౌతోంది. ఇంట్లో వాళ్ళకు కూడా తమ కొత్త కోడలు అర్థమైకానట్టుగా ఇది సాగింది.
విశేషం ఏమంటే... సమంత భర్త రాజ్ నిడుమోరు ఈ సినిమాకు క్రియేటర్. అంతే కాదు... వసంత్ మారిన్ గంటితో కలిసి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశాడు. గతంలో సమంతతో రాజ్ 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరిస్ చేశాడు. అందులో సమంత పైకి ఓ దిగువ మధ్యతరగతి యువతిలా కనిపించే ఎల్.టి.టి.ఈ. తీవ్రవాది పాత్రను పోషించింది. ఉన్నట్టుండి అవతలి ప్రత్యర్థులపైకి చిరుతలా దూకుతుంది సమంత. అలానే ఆమెతోనే 'సిటాడెల్ హనీ బన్నీ' లోనూ ఫైట్స్ చేయించాడు. 'మా ఇంటి బంగారం' లోని పాత్ర కూడా అదే ఛాయల్లో సాగింది. అయితే... ఆమె ప్రతీకారం వెనుక కారణం ఏమిటనేది ట్రైలర్ లో ఎక్కడా రివీల్ చేయలేదు.
నందినీరెడ్డి గతంలో సమంత నటించిన 'జబర్దస్త్, ఓ బేబీ' చిత్రాలకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకూ ఆమెనే దర్శకురాలు. అయితే నందినీరెడ్డి కంటే కూడా రాజ్ నిడుమోరు టీమ్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. పేరుకు ఇది 'మా ఇంటి బంగారం' కానీ ట్రైలర్ మొత్తం యాక్షన్ ప్యాక్డ్ గా 'మా ఇంటి ఫైటర్' అనేలా ఉంది. ఈ సినిమాలోని బస్ ఎపిసోడ్ మాత్రం ఇటీవల వచ్చిన అనుష్క 'ఘాటీ'లోని ఫైట్ సీక్వెన్స్ ను గుర్తు చేస్తోంది.
'మా ఇంటి బంగారం' సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్యతో పాటు గౌతమి, శ్రీలక్ష్మీ, మంజుషా, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రీముఖి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.