Sam CS: ఓటీటీలోనూ సామ్ సీఎస్ సత్తా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు
ABN, Publish Date - Jul 21 , 2026 | 09:41 AM
సంగీత దర్శకుల్లో సామ్ సీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జానర్ సినిమాలను ఆయన అందించే నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్తుంది.
సంగీత దర్శకుల్లో సామ్ సీఎస్‌కు (Sam CS) ప్రత్యేక గుర్తింపు ఉంది. థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జానర్ సినిమాలను ఆయన అందించే నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్తుంది. భావోద్వేగాలను బలంగా ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయన సంగీతం ప్రత్యేక ముద్ర వేస్తుంది. అందుకే సస్పెన్స్, క్రైమ్ తరహా చిత్రాలకు సామ్ సీఎస్‌ను మొదటి ఎంపికగా భావిస్తుంటారు దర్శకులు. వెండితెరపై తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన, ఓటీటీ ప్రపంచంలోనూ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఓటీటీ కంటెంట్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించే 'నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డ్స్'లో (Nexa Indian Streaming Academy Awards) ఉత్తమ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (రీజినల్) విభాగంలో సామ్ సీఎస్ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఈ అవార్డు ఆయనకు 'సుళల్-2' వెబ్ సిరీస్ కు లభించింది. సస్పెన్స్, థ్రిల్లర్ కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చడంలో సామ్ సీఎస్ నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసిన ఆయన సంగీతం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అలాగే, ‘సుళల్-2’ వెబ్ సిరీస్ మొత్తం మూడు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్, ఉత్తమ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (రీజినల్), ఉత్తమ నటి (ఐశ్వర్య రాజేష్) విభాగాల్లో అవార్డులు వచ్చాయి. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వరుస చిత్రాలకు సంగీతం అందిస్తున్న సామ్ సీఎస్ ప్రస్తుతం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమిళంలో తెరకెక్కుతున్న 'కరాటే బాబు', 'సర్దార్-2', పుష్కర్-గాయత్రి కొత్త చిత్రం, వినోద్ దర్శకత్వంలో ధనుష్ సినిమా, 'డిమాంటీ కాలనీ-3' వంటి భారీ చిత్రాలకు ఆయన సంగీతం సమకూరుస్తున్నారు.