ఆర్‌బీ చౌదరి మృతి.. తెలుగు, తమిళ సినీ ప్రముఖుల సంతాపం
ABN, Publish Date - May 05 , 2026 | 08:37 PM
ప్రముఖ నిర్మాత, ఆర్ బి చౌదరి మృతి నేపథ్యంలో టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు చాలామంది తమ సంతాపం తెలిపారు.
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ (Super Good Films) అధినేత ఆర్ బి చౌదరి (RB Choudhary) ఈ రోజు సాయంత్రం రాజస్థాన్ ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్తతో తెలుగు, తమిల సినీ ఇండస్ట్రీలు ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు చాలామంది తమ సంతాపం తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చిరంజీవి, రజనీ కాంత్, వెంకటేశ్, నాగార్జున, కమల్ హసన్, విశాల్, అనీల్ రావిపూడి, బండ్ల గణేశ్, తేజ సజ్జా వంటి సెటబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపి సానుభూతి వ్యక్తం చేశారు.
ఆర్ బి చౌదరి గారి మరణం దిగ్భ్రాంతికరం
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేక పోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఇదిలాఉంటే.. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో, R B చౌదరి నిర్మిస్తున్న 99వ చిత్రం మకుటం. విశాల్ (Vishal) హీరోగా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. అయితే.. చౌదరి మరణ వార్త తెలుసుకున్న యూనిట్ సభ్యులు దిగ్భ్రాంతి కి గురయ్యారు. షూటింగ్ సెట్‌లో సంతాప సభ నిర్వహించి నివాళులు అర్పించారు.