'మైసా'తో మెస్మరైజింగ్ చేయబోతున్న రశ్మిక...
ABN, Publish Date - Apr 18 , 2026 | 11:32 AM
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ఎంతో కష్టపడుతోంది. 'మైసా' సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం ఆమె ప్రస్తుతం బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకుంటోంది.
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న (Rashmika Mandanna) పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి పడే కష్టాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. వృత్తిపట్ల అంకితభావం ఉన్న కారణంగానే ఇవాళ రశ్మిక మందన్న జాతీయ స్థాయిలో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకోగలిగింది. ఆమెతో సినిమా చేయాలని దర్శక నిర్మాతలు క్యూ కట్టడానికి కూడా అదే కారణం. కమర్షియల్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రశ్మికలో మంచి నటి కూడా ఉంది. ఇప్పటికే పలు చిత్రాలలో ఆమె నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసి మెప్పించింది. అలానే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌ను ఆమెతో చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. రచయితలు ఆమెను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. అలా తెరకెక్కుతున్న సినిమానే 'మైసా' (Mysaa).
గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'మైసా' ఉండబోతోంది. రశ్మిక మందన్న ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్‌లో కనిపించ బోతోంది. ఈ సినిమా కోసం రశ్మిక మందన్న పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా రోజూ ఎనిమిది గంటల పాటు శరీర ధృడత్వం కోసం రశ్మిక ట్రైనింగ్ తీసుకుంటోంది. చిత్ర బృందం చెబుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రశ్మిక బ్యాంకాక్‌లో ఉంది. అక్కడ రోజుకు ఎనిమిది గంటల పాటు శిక్షణ తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైనర్ సాయంతో రశ్మిక చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే... ఈ చిత్రం ఆమె కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలుస్తుందనిపిస్తోంది. ఈ శిక్షణ పూర్తి కాగానే 'మైసా' తాజా షెడ్యూల్ కేరళలో మొదలు పెట్టి, దాదాపు 16 రోజుల పాటు కొనసాగించబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ సైతం సమ్ థింగ్ స్పెషల్‌గా ఉంటుందని, ఆమె స్టిల్స్ చూస్తే అర్థమౌతోంది. ఈ పవర్ ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ద్వారా రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.