సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు.. ప్రకాశ్‌రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 18 , 2026 | 06:32 AM

ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్‌ రామాయణం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj). ఒక్కోసారి ఆయన పెట్టే పోస్టులు, చేసే ట్వీట్లు వివాదాస్పదమవుతుంటాయి. అలాగే అప్పుడప్పుడు వేదికపై తన మనసులోని భావాలను దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు వెల్లడిస్తూ వివాదాలకు కారణమవుతుంటారు. ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్‌ రామాయణం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంటూ ప్రకాశ్‌రాజ్‌ పేర్కొనడం చూసి నెటిజన్లు మండి పడుతున్నారు.

ఇటీవల కేరళలో జరిగిన సాహిత్యోత్సవంలో ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ప్రకాశ్‌రాజ్‌ చెప్పిన రామాయణ కథ ఇలా సాగింది.. ‘రాముడు, లక్ష్మణుడు దక్షిణాదికి వచ్చారు. వారికి ఒక అడవి కనిపించింది. ‘రామా ఇక్కడ ఒక అడవి ఉంది చూశావా’ అని లక్ష్మణుడు అంటే, ‘ఆ అడవి ఎవరిదో కదా’ అని రాముడు అంటాడు. ఇక్కడ ఎన్నో పళ్లు ఉన్నాయి.. అవి మనం తినవచ్చు అని లక్ష్మణుడు చెబితే, సరేనని వాళ్లిద్దరు ఆ పళ్లు తింటుంటారు. ఇంతలో రావణుడు, శూర్పణఖ అక్కడికి వస్తారు. పళ్లు తింటున్న రామలక్ష్మణులను చూసి ‘అన్నా.. మన పళ్లు ఎవరో తింటున్నారు’ అని రావణుడికి చెబుతుంది శూర్పణఖ. వాళ్లు ఆకలితో ఉన్నట్లున్నారు. ముందు వాళ్లని తిననివ్వు. తర్వాత మాట్లాడదాం’ అంటాడు రావణుడు.

పళ్లు తినడం పూర్తయ్యాక రాముడు వీళ్లను చూస్తాడు. తన తమ్ముడిని ‘లక్కీ’ అని పిలవడం రాముడికి అలవాటు. లక్కీ ట్రైబల్స్‌ ఎవరో వచ్చారు చూడు.. అంటాడు. రావణుడు.. మేం ట్రైబల్స్‌ కాదు.. మేమే యజమానులం’ అని చెబుతాడు. ‘ఓకే.. మీ పళ్లు తిన్నాం. ధర ఎంతో చెబితే ఇచ్చేస్తాం’ అంటాడు రాముడు. శూర్పణఖ లెక్కలు కట్టి రెండు వేల డాలర్లు అయింది.. జీయస్టీతో కలిపి అని చెబుతుంది. మా దగ్గర అంత డబ్బు లేదే అంటాడు రాముడు. వాళ్లకి కొంత డిస్కౌంట్‌ ఇవ్వు’ అని చెల్లెలికి చెబుతాడు రావణుడు.

సరే 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నాను.. అంటుంది శూర్పణఖ. అంత డబ్బు కూడా మా దగ్గర లేదు.. అంటాడు రాముడు. మీరు టూరిస్టులు కాదు.. ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. మీరు తినగా మిగిలిన విత్తనాలు ఉన్నాయి కదా. వాటిని నాటి పెంచండి.. ఇంతకీ మీ పేర్లు ఏమిటి’ అని అడుగుతాడు రావణుడు.. నా పేరు రాముడు.. ఉత్తరాది నుంచి వచ్చాను. అలాగా నా పేరు రావణుడు దక్షిణాది నుంచి వచ్చాను అంటాడు... ఇలా రామాయణాన్ని కొత్తగా, వ్యంగ్యంగా ఆ కార్యక్రమంలో చెప్పారు ప్రకాశ్‌రాజ్‌. పవిత్ర ఇతిహాసాన్ని ఇప్పటి పన్నుల విధానంతో ముడిపెట్టి ప్రకాశ్‌రాజ్‌ ఇలా చెప్పడం వివాదానికి కారణమైంది.

Updated Date - Apr 18 , 2026 | 06:32 AM