జైలర్ 2 ఆన్లైన్ విడుదలపై హైకోర్టు నిషేధం.. అడ్వాన్స్ బుకింగ్స్లో రూ.40 కోట్లు!
ABN, Publish Date - Oct 14 , 2026 | 08:47 AM
రజనీకాంత్ నటించిన జైలర్ 2 ఆన్లైన్ పైరసీపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా, నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రూపొందిన జైలర్-2 (Jailer 2) మూవీ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చట్ట వ్యతిరేకంగా ఆన్లైన్లో విడుదల చేయడంపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సినిమా విడుదలైన అర్థగంటలోనే వెబ్సైట్, డిజిటల్ ఫ్లాట్ఫామ్లలో 'జైలర్-2' చిత్రాన్ని చట్ట వ్యతిరేకంగా విడుదల చేయకుండా నిషేధం విధించాలని కోరింది. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి పీపీ బాలాజీ నిర్మాణ సంస్థ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, 'జైలర్-2' చిత్రాన్ని చట్ట విరుద్ధంగా ఆన్లైన్ వెబ్సైట్లో విడుదల చేయడంపై నిషేధం విధించారు.
రూ.40 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్
ఇదిలాఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా 'జైలర్-2' మూవీ ఆడ్వాన్స్ బుకింగ్స్ రూ.40 కోట్లు దాటినట్టు సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. స్వదేశంలో రూ.30 కోట్లు, విదేశాల్లో రూ.10 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు పేర్కొన్నాయి. ఈ మొత్తంలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు మాత్రమే రూ.20 కోట్లు ఉందని, అలాగే, అడ్వాన్స్ రూపంలో 20 లక్షల టిక్కెట్లు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈనెల 15న విడుదల కానున్న ఈ మూవీ తొలి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ అందుకోవడం గ్యారెంటీ అంటున్నారు.