రియల్ హీరోలకు తొలి ఎంపిక మాధవన్.. జీడీఎన్‌తో మరో సవాల్
ABN, Publish Date - Aug 06 , 2026 | 03:19 PM
ఆర్. మాధవన్ ఒకప్పుడు రొమాంటిక్ హీరో. కానీ ఇప్పుడు బయోపిక్స్ కు కేరాఫ్ అడ్రస్! మాధవన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకూ చేసిన రియల్ క్యారెక్టర్స్ కొన్నే అయినా వాటిని పోషించిన తీరు వల్ల ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందారు.
ఆర్. మాధవన్ ఒకప్పుడు రొమాంటిక్ హీరో. కానీ ఇప్పుడు బయోపిక్స్ కు కేరాఫ్ అడ్రస్! మాధవన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకూ చేసిన రియల్ క్యారెక్టర్స్ కొన్నే అయినా వాటిని పోషించిన తీరు వల్ల ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందారు. తాజాగా మాధవన్ నటించిన మరో బయోపిక్ 'జి.డి.యన్.' శుక్రవారం జనం ముందుకు రాబోతోంది.
ఇండియన్ ఎడిసన్ 'జీడీఎన్'!
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ కు కొదవలేదు. క్రీడారంగానికి చెందిన వ్యక్తులు మొదలుకొని బందిపోట్ల వరకూ అందరి బయోపిక్స్ తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే. ఇందులో వివాదాస్పందమైన ప్రముఖుల బయోపిక్స్ ను ఎంచుకుని చేస్తున్నాడు ఆర్. మాధవన్. ఆయన నటించిన లేటెస్ట్ బయోపిక్ 'జి.డి.ఎన్.' తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదల కాబోతోంది. జీడీ నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. ఇండియన్ ఎడిసన్ అని గుర్తింపు పొందిన జీడీఎన్ దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు. చదివింది మూడో తరగతే అయినా తన తెలివితేటలతో భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు. ఆయన జీవిత గాథ ఆధారంగా కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కించిన చిత్రంలో మాధవన్ టైటిల్ రోల్ ప్లే చేశారు. ప్రియమణి, సత్యరాజ్, దుషారా విజయన్, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జీడీఎన్ జీవితంలో బ్రిటీషర్స్ నుంచి స్వదేశీయుల నుంచి ఎదురైన వింతైన సంఘటనలకు ఈ సినిమా నిదర్శనం కాబోతోంది.
నంబి నారాయణన్ గా మెప్పించి...
మాధవన్ కు నిజ జీవిత పాత్రలు పోషించడం కొత్తేమీ కాదు. తాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'రాకెట్రీ' చిత్రంలో అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రను పోషించి మెప్పించారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన నంబి నారాయణన్ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగాయి. కొందరి కుట్ర కారణంగా ఆయన సమాజం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అయితే ఎప్పటికైనా సత్యం గెలుస్తుందనే నానుడిని నంబి నారాయణన్ నిజం చేసి చూపారు. దాంతో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ తో సత్కరించింది. నంబి నారాయణన్ పోరాట స్ఫూర్తిని 'రాకెట్రీ' పేరుతో మాధవన్ తెరకెక్కించారు. ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డును గెలుచుకుంది.
అజిత్ దోవల్ పాత్రకు ప్రాణం పోసి...
మాధవన్ ఏ పాత్ర పోషించినా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'గురు' సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శ్యామ్ సక్సేనా పాత్రను మాధవన్ పోషించారు. దీనికి ప్రముఖ పాత్రికేయుడు ఎస్. గురుమూర్తి స్ఫూర్తి. అప్పట్లో గురుమూర్తి... ప్రముఖ పారిశ్రామికవేత్త దీరూభాయి అంబానీ వ్యాపార సామ్రాజ్యంలోని అవక తవకలను ఎత్తి చూపిన అంశాలను ఈ చిత్రంలో మాధవన్ పాత్ర ద్వారా చూపించారు. అలానే మాధవన్ 'రంగ్ దే బసంతి' మూవీలో కనిపించేది కేవలం తొమ్మిది నిమిషాలే. అందులో ఆయన పోషించిన ఫ్లయిట్ లెఫ్టినెంట్ అజయ్ సింగ్ రాథోడ్ పాత్ర సినిమాకు ప్రాణం. మిగ్ 21 జెట్ ప్రమాదంలో అసువులు బాసిన అజయ్ సింగ్ పాత్రను మాధవన్ అద్భుతంగా పోషించి, ఆ సినిమా విజయానికి తానూ కారకులయ్యారు. తాజాగా వచ్చిన 'ధురంధర్' చిత్రాల్లో భారత నిఘా అధికారి అజిత్ కుమార్ దోవల్ పాత్రను మాధవన్ అద్భుతంగా పోషించారు. కీర్తి చక్ర శౌర్య పురస్కారం అందుకున్న అజిత్ దోవల్... ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన ఎన్నో సన్నివేశాలు 'ధురంధర్ -2' కనిపిస్తాయి. ఈ పాత్రకు మాధవన్ నూరు శాతం న్యాయం చేకూర్చారని విమర్శకులు ప్రశంసించారు. ఫిక్షనల్ పాత్రల పోషణలో ఉండే స్వేచ్ఛ... నిజ జీవిత పాత్రల పోషణలో ఉండదని, అయినా ఆ పాత్ర స్వరూప స్వభావాలను దృష్టిలో పెట్టుకుని వాటిని చేస్తుంటానని మాధవన్ చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో మరెన్ని బయోపిక్స్ లో మాధవన్ నటిస్తారో చూడాలి.