R Madhavan: చాక్లెట్ బాయ్ To 'పద్మశ్రీ' మాధవన్
ABN, Publish Date - Jan 26 , 2026 | 07:37 AM
భాషా భేదం లేకుండా ప్రేక్షకులను మెప్పించిన మల్టీ టాలెంటెడ్ స్టార్ ఆర్. మాధవన్‌కు కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం అందించింది.
చాక్లెట్ బాయ్‌గా పరిచయమై, విలక్షణ నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన ఆర్. మాధవన్ (R.Madhavan) ను కేంద్రం పద్మశ్రీతో (Padma Shri) సత్కరించింది. భాషా భేదం లేకుండా, దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను సమానంగా మెప్పించిన ఆయన ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనం. మణిరత్నం ‘సఖి’ (అలైపాయుతే) సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన మాధవన్ ఆ ఇమేజ్‌లో ఇరుక్కుపోకుండా ప్రయోగాలు చేశారు. ‘3 ఇడియట్స్, విక్రమ్ వేద’ లాంటి సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆయనకున్న అవగాహన, సినిమాపట్ల ఆయనకున్న అంకితభావం ఆయనను ఈ స్థాయికి చేర్చాయి.
మాధవన్ జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి టాటా స్టీల్‌లో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయగా, తల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా సేవలందించారు.ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో విద్యాభ్యాసం చేసిన మాధవన్, కళాశాల రోజుల్లో కెనడాకు సాంస్కృతిక రాయబారిగా భారతదేశాన్ని ప్రతినిధ్యం వహించడం విశేషం. అంతేకాకుండా సైనిక శిక్షణ కూడా పొందారు.
సినిమాల్లోకి రావడానికి ముందు మాధవన్ టెలివిజన్ రంగంతో తన ప్రయాణాన్ని ఆరంభించి సుమారు 1800కి పైగా ఎపిసోడ్‌లలో నటించి అనుభవం సంపాదించారు. ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘అలైపాయుతే’ (తెలుగులో ‘సఖి’) చిత్రంతో వెండితెరకు పరిచయమైన మాధవన్, ఆ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ‘చాక్లెట్ హీరో’గా పేరు తెచ్చుకుని, యువతలో ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ను సంపాదించారు.
ఆపై రేహనా హై తేరే దిల్ మే, 3 ఇడియట్స్, తనూ వెడ్స్ మను, రంగ్ దే బసంతి వంటి హిందీ సినిమాలతో బాలీవుడ్‌లో సెటిల్ అయ్యారు. ఈ చిత్రాలతో రొమాంటిక్ హీరోగా మాత్రమే కాకుండా, సీరియస్ మరియు ఇంటెన్స్ పాత్రల్లోనూ తన ప్రతిభ చాటుకున్నారు. ఆడపా దడపా విక్రమ్ వేద వంటి సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే.. గత సంవత్సరం దర్శకుడిగా మారి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘రాకెట్రీ’ చిత్రాన్ని ఆయన దర్శకత్వం వహించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం మాధవన్‌లోని మరో కోణాన్ని అవిష్కరించింది.