సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Singer Nisar నిసార్‌ వయనాడ్‌ కన్నుమూత.. షోకు కొన్ని గంటల ముందే విషాదం

ABN, Publish Date - Sep 07 , 2026 | 05:10 PM

ప్రముఖ మలయాళీ గాయకుడు నిసార్ వయనాడ్ దుబాయ్‌లో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Singer Nisar Wayanad

ప్రముఖ మలయాళీ గాయకుడు నిసార్ వయనాడ్ దుబాయ్‌లో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  అజ్మాన్‌లో శనివారం జరగాల్సిన ఓ సంగీత కార్యక్రమంలో నిసార్‌ పాల్గొనాల్సి ఉంది. అయితే షోకు కొన్ని గంటల ముందే ఆయన మృతి చెందడంతో యూఏఈలోని మలయాళీ కమ్యూనిటీ, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిసార్‌ గత నెలలో ఓ సంగీత కార్యక్రమం కోసం దుబాయ్‌ వెళ్లారు. అక్కడ కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. తొలుత వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో దుబాయ్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. సెప్టిసీమియా కారణంగా ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు వెల్లడించారు. రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ కారణంగా అవయవాలు దెబ్బతిన్నాయని, శరీరంలో అసిడోసిస్‌ పెరగడంతో మృతి చెందినట్లు తెలిపారు. 

నిసార్‌ వయనాడ్‌ అసలు పేరు నిస్సార్‌ అరోత్‌ ఇబ్రహీం. ఆయనకు భార్య షహానా నిసార్‌, ఇద్దరు కుమార్తెలు సింబ్రీనా, అంబ్రీనా ఉన్నారు. కేరళలోని వయనాడ్‌ జిల్లాకు చెందిన ఆయన దుబాయ్‌లో నిర్వహించే సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గాత్రం ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ గొంతును పోలి ఉండటంతో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. హిందీ, మలయాళ పాటలతో పాటు ఉదిత్‌ నారాయణ్‌, అర్జిత్‌ సింగ్‌, అతీఫ్‌ అస్లాం తదితర గాయకుల పాటలను నిసార్‌ అద్భుతంగా పాడేవారు. రాబోయే రోజుల్లో దుబాయ్‌, సౌదీ అరేబియాలో పలు సంగీత కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అలాగే మలయాళ చిత్రాల్లో పాటలు పాడేందుకు కూడా కొన్ని అవకాశాలు ఖరారైనట్లు సమాచారం. నిసార్‌ మృతి వార్త తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అభిమానులు, స్నేహితులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సుమారు 300 మందికి పైగా ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. అర్ధరాత్రి తర్వాత ప్రార్థనలు నిర్వహించి, ఆయన పార్థివదేహాన్ని కేరళకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిసార్‌ మృతిపై ఆర్జే మిథున్‌ రమేష్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌ అఫ్సల్‌ సహా పలువురు యూఏఈ ఈవెంట్‌ నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 07 , 2026 | 05:14 PM