వామ్మో.. 'జన నాయకుడు' ఇంత నష్టం తెచ్చాడా? విజయ్.. చివరి సినిమా పరిస్థితి ఇదే!
ABN, Publish Date - Aug 06 , 2026 | 03:58 PM
అభిమానుల హంగామా, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి అంచనాలు, పొలిటికల్ డిమాండ్లు.. వీటన్నింటి మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయ్ చివరి చిత్రం జన నాయగన్.
అభిమానుల హంగామా, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి అంచనాలు, పొలిటికల్ డిమాండ్లు.. వీటన్నింటి మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయ్ చివరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan). ఇలయదళపతి విజయ్ (Vijay), పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రల్లో హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీయన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే వెంకట నారాయణ ఈ చిత్రాన్ని దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంపై మొదటి నుంచీ కోలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో సూపర్‌హిట్ అయిన భగవంత్ కేసరి రీమేక్‌గా తెరకెక్కడం, పైగా విజయ్ సినీ కెరీర్‌లోనే ఇది ఆఖరి సినిమా కావడం దీనికి ప్రధాన కారణం. కానీ, తీరా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
సాధారణంగా విజయ్ సినిమా అంటే చాలు, టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. గతంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ది గోట్ చిత్రం కూడా ఏకంగా ₹400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి విజయ్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది. అయితే, జననాయగన్ విషయంలో పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ₹300 కోట్ల మార్కును అందుకోగలిగినప్పటికీ, అక్కడే థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ₹300 కోట్లు అనేది చిన్న సంఖ్య ఏమీ కాదు, కానీ సినిమా బిజినెస్ రేంజ్ ముందు ఇది సరిపోవడం లేదనేది అసలు సమస్య. సినిమా విడుదల కాకముందే కోలీవుడ్‌లో జరిగిన బిజినెస్ ఇన్‌సైడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈసినిమా థియెట్రికల్ బిజినెస్ దాదాపు ₹450 కోట్లకు జరిగింది.
కానీ ఈ చిత్ర కలెక్షన్స్ ₹300 కోట్ల వద్దే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల నిర్మాణ సంస్థ కేవీయన్ ప్రొడక్షన్స్ (KVN Productions) భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. విజయ్ కెరీర్ లాస్ట్ మూవీ అనే క్రేజ్ సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో పెద్ద ప్లస్ పాయింట్ అయినప్పటికీ, కథను తెరకెక్కించిన విధానం ఆకట్టుకోకపోవడంతో నెగెటివ్ ఇంపాక్ట్ పడింది. బాటమ్ లైన్ ఏంటంటే.. కలెక్షన్స్ వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు భారీ లాస్ తప్పట్లేదు.
ఈ చిత్రం ఎదుర్కొన్న సమస్యలు కేవలం థియేటర్లలో మాత్రమే లేవు. రిలీజ్ కావడానికి ముందే అనేక వివాదాలు, అడ్డంకులు చుట్టుముట్టాయి. దాదాపు 6 నెలలకు పైగా సెన్సార్ పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత చివరకు 'A' సర్టిఫికెట్‌తో థియేటర్లకు రావాల్సి వచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సీఎంగా గెలిచేంత వరకు కూడా జననాయగన్ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జులై 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను మూటగట్టుకుంది.
థియేట్రికల్ రన్ ద్వారా వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి డిజిటల్, శాటిలైట్ హక్కులే ఏకైక మార్గంగా కనిపిస్తున్నాయి. ఇక జననాయగన్ ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడు పోయాయని సమాచారం. ఈ నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం నిర్మాతలను ఎంతవరకు సేఫ్ జోన్ లోకి తీసుకెళ్తుందో వేచి చూడాలి. ఏదేమైనా, ఒక తిరుగులేని స్టార్ కథానాయకుడి ముగింపు చిత్రం ఈ స్థాయిలో బాక్సాఫీస్ ఒడిదొడుకులను ఎదుర్కోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.