ఎన్టీఆర్-నీల్ ఫస్ట్ లుక్ ఫిక్స్... రిలీజ్ డేట్ లాక్..?
ABN, Publish Date - Apr 16 , 2026 | 01:24 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విడుదలలో మరింత జాప్యం కనిపించేలా ఉంది. వ్యవహారాన్ని చూస్తుంటే... ఈ సినిమా ఈ యేడాది రాదేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ పవర్ అలాగే ప్రశాంత్ నీల్ విజనరీ మేకింగ్ కలిస్తే వెండితెరపై సునామీ రావడం ఖాయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ విడుదల తేదీపై ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ సినిమాను మొదట 2026 జనవరిలో, ఆ తరువాత 2026 జూన్ 25న వస్తుందని మేకర్స్ ప్రకటించారు. అయితే, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడని నీల్, ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు 2027 డిసెంబర్‌ను లాక్ చేసినట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సరికొత్త వరల్డ్ బిల్డింగ్ కోసం ఈ అదనపు సమయం తీసుకుంటున్నట్లు సంగీత దర్శకుడు రవి బస్రూర్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కేవలం విడుదల తేదీ మాత్రమే కాకుండా, ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తుండటం కూడా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. గతంలో 'సలార్' సినిమాలో ప్రభాస్‌ను డైనోసార్‌తో పోల్చిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఎన్టీఆర్‌ను అంతకుమించిన విధ్వంసకర డ్రాగన్ లా చూపించబోతున్నారట. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన బాడీని పూర్తిగా మార్చుకుంటున్న తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల జోర్డాన్‌లో పూర్తయిన భారీ యాక్షన్ షెడ్యూల్ ఈ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించనుంది. ఎడారి ప్రాంతంలో చిత్రీకరించిన ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. దీనికి తోడు 'కాంతార' ఫేమ్ రుక్మిణి వసంత్ గ్లామర్ అలాగే బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ పోషిస్తున్న అత్యంత శక్తివంతమైన పొలిటికల్ రోల్ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రీసెంట్‌గా కండలు తిరిగిన దేహంతో కనిపించిన ఎన్టీఆర్ లుక్ ఇప్పటికే వైరల్‌గా మారింది. ఇది కేవలం ఎన్టీఆర్ డెడికేషన్‌కు మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ సృష్టించిన ప్రపంచంలో తారక్ సృష్టించబోయే విధ్వంసానికి నిదర్శనమని ఆయన కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.
2027 వరకు ఆగడం అభిమానులకు కాస్త ఇబ్బందే అయినా, స్క్రీన్ మీద కనిపించే ఆ విజువల్ వండర్ ఆ నిరీక్షణకు తగిన ఫలితాన్ని ఇస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం నుంచి వచ్చే స్పెషల్ గ్లింప్స్ సినిమా అసలు సిసలు రేంజ్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ గ్లింప్స్‌తో పాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా, ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ తో పాటు నీల్ మార్క్ యాక్షన్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డుల లెక్కలు పూర్తిగా మారిపోతాయనేది సినిమా ప్రేమికులందరూ నమ్మే మాట. డిసెంబర్ నెల ప్రశాంత్ నీల్‌కు సెంటిమెంట్‌గా కలిసివచ్చే సీజన్ కావడంతో, 'డ్రాగన్' ప్రభంజనం 2027 చివరిలో థియేటర్లను దద్దరిల్లజేయడం ఖాయంగా కనిపిస్తోంది.