Nayanthara: నయనతారకు వరుస షాకులు.. ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్స్!
ABN, Publish Date - Nov 07 , 2026 | 09:40 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara)కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. భారీ అంచనాలతో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందించకపోవడంతో ఆమెకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara)కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. భారీ అంచనాలతో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందించకపోవడంతో ఆమెకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో నయనతార ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్ చేరినట్లయింది. యశ్ కథానాయకుడిగా నటించిన ‘టాక్సిక్’ ప్రాజెక్ట్‌లో నయనతార కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమె పాత్రపై మొదట్లో భారీ ప్రచారం జరిగింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చెప్పిన కథ, పాత్ర నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఆమె అంగీకరించినట్లు మేకర్స్ చెప్పారు. ఈ సినిమా విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు, విడుదలకు సంబంధించిన పరిస్థితులు ఆమెకు ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. ఆ తర్వాత ‘హాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్. ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఆమె నటించిన ‘మూకుతి అమ్మన్ 2’ తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో విడుదలైంది. సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దగా ప్రచారం లేకుండానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నయనతారకు ఉన్న క్రేజ్‌తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించినా, ఆ అంచనాలు ఫలించలేదు. తెలుగు ప్రేక్షకులకు సినిమా విడుదలైన విషయం కూడా పెద్దగా తెలియకపోవడం, విడుదల తర్వాత వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ మరింత ఇబ్బందిగా మారాయి. కథ, తెరకెక్కించిన విధానంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. నయనతార చక్కని నటన కనబరిచినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు కథానాయికగా వరుస విజయాలతో దూసుకెళ్లిన నయనతారకు ఇప్పుడు కథల ఎంపికలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే వినిపిస్తోంది.