సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Eko movie Review: కుక్కలతో క్రూరంగా చంపించే యజమాని.. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్

ABN, Publish Date - Jan 06 , 2026 | 05:42 PM

గతంలో కిష్కింద కాండ సినిమాతో మెప్పించిన దర్శకుడు దింజిత్ అయ్యతాన్ (Dinjith Ayyathan).. ఇప్పుడు ఎకో (Eko Movie) చిత్రంతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Eko movie Review

Eko movie Review: సినిమా ప్రేక్షకులకు, మిస్టిక్ థ్రిల్లర్స్‌కు మధ్య ఒక విడదీయరాని బంధం ఉంటుంది. అందులోనూ ఆ కథలో సస్పెన్స్ ఎలిమెంట్ ఉందంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే గ్లోబల్ ట్రెండ్ సెట్ చేసేవరకు వదిలిపెట్టరు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమ ఇలాంటి ప్రయోగాత్మక థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గతంలో కిష్కింద కాండ సినిమాతో మెప్పించిన దర్శకుడు దింజిత్ అయ్యతాన్ (Dinjith Ayyathan).. ఇప్పుడు ఎకో (Eko Movie) చిత్రంతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది.

సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో హత్యలు, దొంగతనాలు ఉంటాయి. కానీ ఈ సినిమా ప్రొటెక్షన్ వర్సెస్ రిస్ట్రిక్షన్ అనే ఒక వినూత్నమైన పాయింట్ చుట్టూ తిరుగుతుంది. కథగా చెప్పడానికి చాలా చిన్న పాయింట్. కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని ఒక మారుమూల ఎత్తైన కొండ ప్రాంతమే ఈ కథకు వేదిక. కురియాచన్ (సౌరభ్ సచ్ దేవ్) అనే వ్యక్తి కోసం అటు పోలీసులు.. ఇటు నేవీ అధికారులు వెతుకుతూ ఉంటారు. అతని భార్య మిలాతియా(బియానా మోమిన్) ఒంటరిగా కొండపై ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు ఎవరైనా వెళ్ళాలి అంటే చాలా క్రూరంగా ఉండే మలేషియా కుక్కలను దాటుకొని వెళ్ళాలి. అయితే ఆ కుక్కలను కురియాచన్ శాసిస్తున్నాడని, తన కోసం వచ్చిన పోలీసులను, వారి శత్రువులను ఆ కుక్కలచేతనే చంపిస్తున్నాడని ఊర్లో మాట్లాడుకుంటారు. ఇక తల్లి మిలాతియాను చూసుకోవడానికి ఆమె కొడుకులు అక్కడ పీయోస్(సందీప్ ప్రదీప్) అనే కుర్రాడిని పనిలో పెడతారు. ఇంకోపక్క కురియాచన్ మీద పగతో అతని స్నేహితుడు మోహన్ పోతన్ (వినీత్) అడివికి వెళ్లి హత్యకు గురవుతాడు. ఈ హత్య కూడా కురియాచనే చేశాడా.. ? అసలు అతను ఎక్కడ ఉన్నాడు.. ? కురియాచన్ ఏం తప్పు చేశాడు.. ?పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు.. ? పీయోస్ కి.. కురియాచన్ కి ఉన్న సంబంధం ఏంటి? కుక్కలను శాసిస్తుంది ఎవరు.. ? ఈ ప్రశ్నల చుట్టూనే సినిమా మొత్తం హై-వోల్టేజ్ సస్పెన్స్‌తో సాగుతుంది.

కథ చాలా స్లోగా ఉంటే చూడడం చాలా కష్టం. కానీ, ఆ సాగదీతను కూడా డైరెక్టర్ చాలా తెలివిగా వాడుకున్నాడు. చుట్టూ అడివి.. మధ్యలో ఒక చిన్న ఇల్లు. దాని చుట్టూనే కథను నడిపాడు. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆ ప్రకృతి కనిపిస్తుంది. ఒక మహిళ కుక్కలను నమ్మి అన్నేళ్ళుగా ఒక్కత్తే ఇంట్లో ఉంటుంది అంటే వాటి విశ్వాసం అలాంటిది అని చూపించాడు. కుక్కలలానే మనుషుల్లో కూడా కొందరు విశ్వాసం ఉన్నవాళ్లు ఉంటారు. వారికి వారి యజమానిని కాపాడుకోవాలి అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అని పీయోస్ పాత్ర ద్వారా చెప్పించాడు డైరెక్టర్. అస్సలు క్లైమాక్స్ ట్విస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమని చెప్పొచ్చు. లాస్ట్ షాట్ లో ఆ కుక్కల క్రూరమైన రూపం చూసినప్పుడు గుండెల్లో గుబులు పుడుతుంది.

ఇక ఈ సినిమాలో వినీత్, యానిమల్ ఫేమ్ సౌరభ్ వంటి నటులు ఉన్నప్పటికీ, అసలైన యాక్టర్స్ మాత్రం సినిమాలో కనిపించే కుక్కలే అని చెప్పాలి. టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు ప్రతి ఫ్రేమ్‌లోనూ అవి కనిపిస్తాయి. కొన్ని సీన్లలో ఆ కుక్కలు వైల్డ్‌నెస్‌, ప్రొటెక్షన్‌ చూస్తుంటే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే, ఈ సినిమాలో కుక్కలే కథను నడిపిస్తాయి, అవే క్లైమాక్స్‌ను శాసిస్తాయి. కమర్షియల్ సినిమాల్లో ఉండే లవ్ ట్రాకులు, అనవసరపు పాటలు, కామెడీ బిట్లు ఏవీ లేకుండా, దర్శకుడు కేవలం కథ మీద మాత్రమే దృష్టి పెట్టాడు. అందుకే సినిమా స్లోగా సాగుతున్నా, ఎక్కడా బోర్ కొట్టకుండా మనల్ని సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఎకో, అక్కడ కూడా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ అందరికీ షాక్ ఇస్తోంది. రీసెంట్‌గా మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చారు. మిస్టిక్ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్లకు ఎకో సినిమా ఒక పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

Updated Date - Jan 06 , 2026 | 05:43 PM