Mohanlal: దృశ్యం 3 రిలీజ్ డేట్ లాక్!
ABN, Publish Date - Jan 14 , 2026 | 07:14 PM
మోహన్ లాల్, మీనా జంటగా నటించిన 'దృశ్యం 3' మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. హిందీ 'దృశ్యం 3' కంటే ఆరు నెలల ముందే ఈ సినిమా విడుదల కాబోతోంది.
గత యేడాది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) కు బాక్సాఫీస్ బరిలో మిశ్రమ స్పందన లభించింది. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఎల్ 2: ఎంపురాన్' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోగా, వివాదాలకు తెరలేపింది. అయితే ఆ తర్వాత వచ్చిన మీడియం బడ్జెట్ మూవీ 'తుడరమ్' మోహన్ లాల్ లోని నటుడిని మరోసారి గొప్పగా ఆవిష్కరించింది. మోహన్ లాల్, శోభన జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగు సినిమా 'కన్నప్ప'లోనూ కిరాతార్జనీయం ఎపిసోడ్ లో మోహన్ లాల్ నటించి, మెప్పించాడు. మోహన్ లాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషించిన 'హృదయపూర్వం' సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే చివరిలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'వృషభ' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఈ యేడాది మోహన్ లాల్ నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'దృశ్యం 3' (Drishyam 3) రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. 'దృశ్యం' ఫ్రాంచైజ్ లో భాగంగా హిందీలోనూ అజయ్ దేవ్ గన్ డైరెక్ట్ గా 'దృశ్యం 3'ని చేస్తున్నాడు. అయితే ఆ సినిమా అక్టోబర్ 2న వస్తుండగా, దానికి ఆరు నెలల ముందే మోహన్ లాల్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమాను వెంకటేశ్ కూడా తెలుగులో రీమేక్ చేయడానికి అంగీకారం తెలిపాడు. అయితే... ఇది కాస్తంత ఆలస్యంగానే సెట్స్ పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్, త్రివిక్రమ్ మూవీ 'ఆనంద నిలయం' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.
ఇక 'దృశ్యం 3' సినిమా పోస్టర్ మీద ఆసక్తికరమైన కోట్ ను పెట్టారు. 'సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ గతం కాదు' అని పేర్కొన్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) మాట్లాడుతూ, 'దృశ్యం సినిమా కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందిని ప్రభావితం చేస్తూ వచ్చింది. దాంతో సహజంగానే దాని మీద భారీ అంచనాలు ఉంటాయి. అందుకే ఎలాంటి ముందస్తు ఊహాగానాలకు తావు ఇవ్వకుండా ఈ సినిమాను చూడాల్సిందిగా కోరుతున్నాను' అని అన్నారు.
భార్య, ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితాన్ని సాగిస్తున్న కేబుల్ టీవీ నిర్వాహకుడు జార్జ్ కుట్టీ జీవితంలోకి ఐజీ గీతా ప్రభాకర్ కొడుకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయి. కనిపించకుండా పోయిన తన కొడుకు కోసం గీతా ప్రభాకర్ ఎలాంటి పోరాటం చేసింది అనే అంశాల చుట్టూనే 'దృశ్యం' ఫ్రాంచైజ్ తిరుగుతూ వస్తోంది. మరి ఈ మూడో చిత్రంలో ఈ అంశాన్ని జీతు జోసఫ్ ఎలా డీల్ చేస్తాడో అని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మోహన్ లాల్ తో పాటు ఈ సినిమాలో మీనా, అన్సిబా హస్సన్, ఈస్తర్ అనిల్, ఆశా శరత్, మురళీ గోపీ, సిద్ధిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.