సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Drishyam 3, Karuppu: టాక్ బ్యాడ్‌.. క‌లెక్ష‌న్లు టాప్‌! వ‌సూళ్లు.. ద‌ద్ద‌రిల్లి పోతున్నాయిగా

ABN, Publish Date - May 28 , 2026 | 10:06 PM

కొన్ని సినిమాల జాతకాలు గొప్పగా ఉంటాయి. ఫిల్మ్ గోయర్స్ అంత గొప్పగా లేదని పెదవి విరిచినా, క్రిటిక్స్ మిక్స్‌ డ్‌ రివ్యూస్ ఇచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం అదరగొడుతుంటాయి. ఇటీవల వచ్చిన తమిళ చిత్రం 'కరుప్పు', మలయాళ మూవీ 'దృశ్యం -3' ఆ కోవకు చెందినవే!

drishyam

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), మీనా జంటగా నటించిన దృశ్యం 3 (Drishyam 3) మూవీ లాస్ట్ థర్స్ డే విడుదలైంది. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో జనం ముందుకు వచ్చింది. అయితే 'దృశ్యం' మొదటి రెండు భాగాలతో పోల్చితే అంత బాగాలేదనే టాక్ తో రావటంతో పాటు రివ్యూవర్స్ సైతం అదే భావన వ్యక్తం చేశారు. మొదటి రెండు భాగాలలో ఉన్నట్లు ఊహకందని ట్విస్టులు లేవని, చివరి ఇరవై నిమిషాల సినిమా కాస్త బెటర్‌గా ఉందనే అభిప్రాయం వక్తం చేశారు. అయితే వసూళ్ళు మాత్రం టాక్ కు భిన్నంగా ఉన్నాయి. మొదటి వారాంతానికి ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేసింది. అంతేకాదు.. అమెరికాలో ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఆంటోని పెరుంబవూర్‌ నిర్మించిన 'దృశ్యం 3' మోహన్‌ లాల్‌ - జీతు జోసఫ్‌ జోడీకి ఇంకా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది.

రూ. 150 కోట్లు దాటిన 'కరుప్పు'

ఈ మధ్య కాలంలో సూర్య (Suriya) నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్‌ దగ్గర గొప్ప ఫలితాల్ని అందుకోలేదు. దాంతో అభిమానులంతా అతని తాజా చిత్రం కరుప్పు (Karuppu) మీదే ఆశలు పెట్టుకున్నారు. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ కోర్ట్ డ్రామా రిలీజ్‌ టైమ్‌లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. హీరో సూర్య చొరవ చూపడంతో మొత్తానికి రిలీజ్‌ అయ్యింది. 'కరుప్పు' చూసి అభిమానులు ఆనందించారు కానీ సామాన్య ప్రేక్షకులు, క్రిటిక్స్ పెదవి విరిచారు.

తెలుగులో వీరభద్రుడు (Veerabhadrudu) పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ సినిమాను విడుదల చేసింది. తెలుగులోనూ సినిమాకు మంచి ఫలితమే దక్కిందంటున్నారు. మే 15న విడుదలైన 'కరుప్పు' టాక్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే రూ. 150 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. త్వరలో రూ. 200 మార్క్ దాటుతుందని ట్రేడ్‌ వర్గాల అంచనా. దాంతో మూవీ మేకర్స్, సూర్య అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. త్రిష ఇందులో కీలక పాత్ర పోషించడంతో ఆమె ఫ్యాన్స్ సైతం ఖుషీ అయ్యారు.

ఆగష్టు 14న 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్'!

సూర్య 'కరుప్పు' ఊహించని విజయాన్ని అందుకోవడం విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ (Vishwanath and Sons) మూవీ నిర్మాత సూర్యదేవర నాగవంశీకి బాగా కలిసివచ్చిందనే అనుకోవాలి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రధారులు. జీవి ప్రకాశ్‌ సంగీతం అందించారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకంటిచారు. తమిళంలో ఈ మూవీని థింక్‌ స్టూడియోస్ సంస్థ రిలీజ్‌ చేయబోతోంది.

ఇదిలా ఉంటే... ప్రస్తుతం సూర్య 'ఆవేశం' ఫేమ్‌ జీతూ మాధవన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాని షూటింగ్‌ సెప్టెంబర్‌ కి పూర్తవుతుంది. ఆ తర్వాత 'జై భీమ్‌' దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ తో సూర్య మూవీ చేయబోతున్నాడట. వాస్తవ సంఘటనల ఆధారంగా 2021లో తెరకెక్కిన 'జై భీమ్‌'లో లాయర్‌ చంద్రు పాత్రను సూర్య పోషించాడు. ఈ సినిమా, అతని పాత్ర రెండూ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో జ్ఞానవేల్‌తో మరో సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని అంటున్నారు. మరి 'కరుప్పు' విజయాన్ని రాబోయే 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' ఏ మేరకు కొనసాగిస్తుంది... ఆపై వచ్చే జ్ఞానవేల్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Updated Date - May 28 , 2026 | 10:13 PM