సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pan India: త‌మిళానికి.. పాన్ ఇండియా దారేది

ABN, Publish Date - Jan 25 , 2026 | 04:10 PM

భారతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాల యుగంలోకి ప్రవేశించింది.

Pan India

భారతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాల యుగంలోకి ప్రవేశించింది. రూ.300 కోట్లు నుంచి రూ.1000 కోట్ల వరకు బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. రాజ‌మౌళి పుణ్య‌మా అని 2009లో మ‌గ‌ధీర‌తో ఈ హై బ‌డ్జెట్ చిత్రాలకు అంకురార్ప‌ణ జ‌రుగ‌గా ఆ మరు సంవ‌త్స‌ర‌మే శంక‌ర్ ర‌జ‌నీతో రోబో మూవీతో బ‌డ్జెట్ స్తాయిని అమాంతం పెంచేశారు. అ త‌ర్వాత తెలుగులో ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలు విరివిగా నిర్మిత‌మ‌వుతూ టోట‌ల్ ఇండియాకే టాలీవుడ్ (Telugu Cinema) కేరాఫ్ ఆడ్ర‌స్‌గా మారింది. బాలీవుడ్‌లో రావ‌ణ్ త‌ప్పితే ఇత‌ర భాష‌ల నుంచి పెద్ద సినిమాలు అంత‌గా కార్య దూపం దాల్చ‌లేదు.

ఇక‌.. బాహుబ‌లి సినిమాల రాక‌ త‌ర్వాతి నుంచి ఇండియ‌న్‌ సినిమా ప‌రిభాష‌నే మారిపోయింది. అంతేగాక కొత్త స్టార్లు పాన్ ఇండియా స్టార్లు సైతం అవ‌త‌రించి వారికంటూ ప్ర‌త్యేక మార్కెట్ త‌యారైంది. దీంతో వారి పేర‌నే సిన‌మాలు త‌యార‌వ‌డం కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే మెగా బడ్జెట్ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ముందుకు తీసుకెళ్లే స్టార్ హీరోల కొరత తమిళ్ ఇండస్ట్రీకి ప్రధాన సమస్యగా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కోణంలో చూస్తే, ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీ (Kollywood) లో రజనీకాంత్ తప్ప మరెవ్వరూ అంతటి స్థాయిలో పాన్ ఇండియా మార్కెట్‌ను నిలబెట్టుకోలేక పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ విజయ్ సినిమాలను కొనసాగించి ఉంటే, ఆయనతో భారీ బడ్జెట్ ప్రాజెక్టులు సులభంగా సాధ్యమయ్యేవని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు సినిమా.. ఆధిపత్యం

ఇదే సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం పాన్ ఇండియా మార్కెట్‌లో స్పష్టంగా ఆధిక్యం సాధిస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నారు.ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో రూపొందుతున్న కొన్ని సినిమాల బడ్జెట్ భార‌తీయ సిన‌మాను ఎలా శాసిస్తుందో అర్థ‌మ‌వుతోంది. ఇదిలాఉంటే.. గ‌డిచిన ఆరు సంవ‌త్స‌రాల‌లో పాన్ ఇండియా ప్రభావం కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా యష్ నటించిన ‘కేజీఎఫ్’ , రిష‌బ్ శెట్టి కాంతార సిరీస్‌ల‌తో కన్నడ సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగి కన్నడ ఇండస్ట్రీకి సైతం కొత్త మార్కెట్ తెరుచుకుంది. మ‌రోవైపు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి అతి త‌క్కువ బ‌డ్జెట్ చిత్రాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ కంటెంట్ బ‌లంతో పాన్‌ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అంతేగాక ఫృథ్వీరాజ్,మోహ‌న్ లాల్‌ వంటి స్టార్లు అటు హిందీ, తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయారు.

ఇక ఎటోచ్చి.. అటు, ఇటు ఎటు కాకుండా స్త‌బ్దుగా మిగిలిపోయింది కోలీవుడ్ మాత్ర‌మే. తమిళ సినిమాలకు టాలెంట్, కంటెంట్, భారీ నిర్మాత‌ల‌కు లోటు లేన‌ప్ప‌టికీ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోల కొరత ఉంది. గ‌తంలో ర‌జ‌నీ, క‌మ‌ల్ త‌ప్పితే మ‌ర‌లా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు ఆ స్థాయిలో పేరు గ‌డించ‌లేక పోయారు. అడ‌పాద‌డ‌పా ర‌జ‌నీ మాత్ర‌మే త‌న స్టామినాతో క్రేజ్ తీసుకు రాగ‌లుగుతున్నారు. మ‌ధ్య‌లో పొన్నియ‌న్ సెల్వ‌న్‌, కూలీ వంటి సినిమాలు వ‌చ్చినా తీవ్రంగా నిరాశ ప‌రిచాయి. త‌మిళ స్టార్స్ ఎక్కువ‌గా సొంత‌ మార్కెట్‌పైనే ఆధారపడటం, కంటెంట్‌లో పాన్ ఇండియా అప్పీల్ తేక పోవ‌డం, తెలుగు మిన‌హా ఇత‌ర‌ భాషల్లో డబ్బింగ్ సినిమాలకు స్పందన లేక‌పోవ‌డం వారికి మైన‌స్‌గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ కొత్త తరం నుంచైనా స్టార్‌లను తీసుకు రాగ‌లుగుతుందా? లేక కంటెంట్ ఆధారిత సినిమాలతోనే ముందుకు సాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులోనైనా తమిళ ఇండస్ట్రీ ఈ గ్యాప్‌ను ఎలా పూడ్చుకుంటుందో చూడాల్సిందే.

Updated Date - Jan 25 , 2026 | 04:49 PM