సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mammootty: జూనియర్ ఆర్టిస్ట్ నుంచి.. పద్మభూషణ్ వ‌ర‌కు

ABN, Publish Date - Jan 26 , 2026 | 06:56 AM

దక్షిణాది సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు.

Mammootty

దక్షిణాది సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ నటుడు, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty)ని ప్రతిష్ఠాత్మక ‘పద్మభూషణ్‌’ (Padma Bhushan) వరించింది. ఐదు దశాబ్దాలుగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన నటనా పటిమకు కేంద్రం పట్టం కట్టింది. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత నటుడిగా మారి సినీరంగంలో అత్యున్నత స్థానాన్ని అందుకున్న మమ్ముట్టి ప్రస్థానం అద్భుతం. నాలుగొందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, మూడుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. ‘మదిలుకల్‌, ఒరు వడక్కన్‌ వీరగాథ, అంబేద్కర్‌’ వంటి చిత్రాలు ఆయన నట విశ్వరూపానికి నిదర్శనాలు. 70 ఏళ్ల వయసులోనూ యువ నటులకు పోటీగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఆయన దూసుకుపోతున్నారు.

మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనపరంబిల్. మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన, ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేసి, కొన్నేళ్లు లాయర్‌గా కూడా పనిచేశారు. కానీ నటనపై ఉన్న మక్కువ ఆయనను వెండితెర వైపు నడిపించింది. 1971లో ‘అనుభవంగళ్ పాలిచకల్’ సినిమాలో చిన్న పాత్రతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆపై నాటకాలు, చిన్న పాత్రల ద్వారా అనుభవం సంపాదించారు. 1979లో లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చినా, ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే 1980లో ‘విక్కనుండు స్వప్నంగల్’ మరియు ‘మేళా’ చిత్రాలు ఆయనకు హీరోగా తొలి గుర్తింపును అందించాయి.

తొలినాట‌ మాస్ పాత్రలు, భర్త, తండ్రి క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించిన మమ్ముట్టిపై ఒక ప్రత్యేకమైన ట్యాగ్ కూడా ఏర్పడింది. కానీ ‘న్యూఢిల్లీ’, ‘తనియావర్తనం’ వంటి సినిమాలు ఆయనలోని లోతైన నటనను వెలుగులోకి తీసుకువచ్చాయి. 1980ల నుంచి 2010ల వరకు మాస్, క్లాస్, ప్రయోగాత్మక కథలతో ఎన్నో అప్ అండ్ డౌన్లను ఎదుర్కొంటూనే భారీ బ్లాక్‌బస్టర్లు అందిస్తూ మెగాస్టార్ హోదాను నిలబెట్టుకున్నారు. సంగం, ఉత్తరం, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కథోడు కఠోరం, ది కింగ్ వంటి సినిమాల్లో ఆయన నటన ఇప్పటికీ ప్రామాణికంగా చూస్తారు. ఇటీవల వ‌చ్చిన కాలంకావ‌ల్‌, కాద‌ల్ ది కోర్ వంటి చిత్రాలు ఆయనలోని అసాధారణ నటనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువ‌చ్చాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ‘స్వాతి కిరణం’, ‘సూర్య పుత్రులు’, ‘యాత్ర’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యాడు.

70 ఏళ్లు దాటినా, ఇప్పటివరకు 450 వ‌ర‌కు సినిమాల్లో నటించిన అరుదైన ఘనత మమ్ముట్టికే సాధ్య‌మైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించారు. మమ్ముట్టి తన కెరీర్‌లో.. 1983 నుంచి 1986 మధ్య కేవలం నాలుగేళ్లలో సుమారు 120 సినిమాల్లో నటించిన వ్య‌క్తిగా ఘనతను సొంతం చేసుకున్నారు. అలాగే మలయాళంలో 15 సార్లు డబుల్ రోల్స్ చేసిన ప్రత్యేక రికార్డు కూడా ఆయన ఖాతాలో ఉంది. ఐదు సినిమాలకుగాను మూడు జాతీయ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్టుగా మొదలైన ప్రయాణం, నేడు అభిమానులు ప్రేమగా ‘మమ్ముక్క’ అని పిలిచే స్థాయికి చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనం.

Updated Date - Jan 26 , 2026 | 07:07 AM