Mamitha Baiju: మమిత జోరు మాములుగా లేదు.. అసలు తగ్గట్లేదుగా
ABN, Publish Date - Jul 20 , 2026 | 05:09 PM
ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో సినిమా అవకాశాలు దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే.. వాటిని సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడం మరో ఎత్తు.
ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో సినిమా అవకాశాలు దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే.. వాటిని సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడం మరో ఎత్తు. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్‌లో ఈ టైమింగ్ చాలా కీలకం. చిన్న అవకాశం వచ్చినా వదలకుండా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. ఈ విషయంలో మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju) ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ప్రేమలు, డ్యూడ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. కర సినిమాతో ఫ్లాప్‌ను అందుకుంది. ఇప్పుడు ఊహించని విధంగా కేవలం నెల రోజుల గ్యాప్‌లో మూడు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.
ఈ జోరులో మొదటిగా రాబోతున్న చిత్రం జననాయగన్. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కొన్ని సెన్సార్ పరమైన కారణాల వల్ల వరుస వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ సూపర్ హిట్ భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా దళపతి విజయ్ ఆఖరి చిత్రం కావడం విశేషం. దీనితో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మమితా భాగం కావడం ఆమె కెరీర్‌కు ప్లస్ కానుంది.
జననాయగన్ హడావుడి ముగియక ముందే.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మమితా అలరించబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రంలో మమితా మెయిన్ హీరోయిన్‌గా కనిపించనుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ భారీ చిత్రం ఆగష్టు 14న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. విజయ్ సినిమా వచ్చిన మూడు వారాల వ్యవధిలోనే సూర్య లాంటి పెద్ద స్టార్ పక్కన నటించిన సినిమా రిలీజ్ కావడం మమితా క్రేజ్‌ను మరింత పెంచేలా కనిపిస్తోంది.
తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. తన సొంత గడ్డ అయిన మలయాళంలోనూ మమితా జెండా పాతేందుకు సిద్ధమైంది. ప్రేమలు దర్శకుడు గిరీష్ ఏడీ కాంబినేషన్‌లో నివిన్ పాలీ హీరోగా ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కుతోంది. ఆ సినిమా పేరే బెత్లెహెం కుడుంబా యూనిట్. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రేమలు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అదే డైరెక్టర్‌తో చేస్తున్న సినిమా కావడంతో మాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కూడా ఆగష్టు 21 వ తేదీన రిలీజ్ కానుండడంతో అమ్మడు ఫుల్ జోష్‌లో ఉంది. కేవలం 30 రోజుల గ్యాప్‌లో.. విజయ్, సూర్య, నివిన్ పాలీ లాంటి ముగ్గురు స్టార్ హీరోల క్రేజీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతుండడంతో సోషల్ మీడియాలో మమితా బైజు పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముప్పై రోజుల బాక్సాఫీస్ వేటతో ఈ అమ్మడి కెరీర్ ఏ రేంజ్‌కు దూసుకుపోతుందో చూడాలి.