Mamitha Baiju: వరుస వందల కోట్ల సినిమాలు.. రెమ్యూనరేషన్ రెండింతలు పెంచేసిన మలయాళ కుట్టి
ABN, Publish Date - Aug 30 , 2026 | 07:26 PM
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది యంగ్ బ్యూటీ మమితా బైజు.
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యంగ్ బ్యూటీ మమితా బైజు (Mamitha Baiju). 2017లో 'రామం రామణి' అనే మలయాళ చిత్రంతో ఒక చిన్న నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. 2024లో వచ్చిన 'ప్రేమలు' చిత్రం మమితా రేంజ్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమాలో ‘రీను’గా ఆమె చెప్పిన డైలాగ్స్, చూపించిన హావభావాలు కుర్రకారును పిచ్చెక్కించేశాయి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రేమలు.. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టడంలో మమితా నటన అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘రెబెల్’, ‘రామచంద్ర బాస్ అండ్ కో’ వంటి చిత్రాలలో నటించి తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ కేరళ కుట్టి.
ఇక ఇటీవల మమితా బైజు ఏకంగా మూడు వేర్వేరు భాషల్లో మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించడం విశేషం. తమిళంలో విజయ్‌తో చేసిన ‘జన నాయగన్’ (Jana Nayagan) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించనప్పటికీ, మమితా నటనకు మాత్రం సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) సినిమాలో తన మార్క్ అల్లరితో సందడి చేసి ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక మలయాళంలో నివిన్ పౌలీతో కలసి నటించిన ‘బెత్లెహేమ్ కుడుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) చిత్రం రూ. 174 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ పేరుతో తెలుగులోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వరుస విజయాలు, భారీ కలెక్షన్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మమితా బైజు.. ఇప్పుడు తన డిమాండ్‌కు తగ్గట్టుగా పారితోషికాన్ని కూడా పెంచేసిందట. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మమితాకున్న క్రేజ్, బాక్సాఫీస్ స్టామినా చూసి నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హిట్ పడితే హీరో అయినా, హీరోయిన్ అయినా రెమ్యూనరేషన్ పెంచడం సహజమే. తమ మార్కెట్ విలువను కాపాడుకోవడానికి ఇది అవసరమే అయినప్పటికీ.. అది నిర్మాతలకు భారం కాకూడదనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే, మమితా బైజు విషయంలో మాత్రం ఆమె తెచ్చే బాక్సాఫీస్ కలెక్షన్ల ముందు ఈ 3 కోట్లు పెద్ద విషయమేమీ కాదని నిర్మాతలు భావిస్తున్నారట. ఏది ఏమైనా ‘ప్రేమలు’తో మొదలైన మమితా బైజు విజయం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.