మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘తుడరుమ్’ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
ABN, Publish Date - Nov 10 , 2026 | 01:56 PM
ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (57) కన్నుమూశారు. పులిమురుగన్, తుడరుమ్, ఒడియన్ సహా 50కి పైగా చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఆయన మరణంతో మాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (Malayalam Cinematographer) షాజీ కుమార్ (57) (Shaji Kumar) కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్లో ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు షాజీ కుమార్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
షాజీ కుమార్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కేరళలోని అలప్పుళకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస చేసిన సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తడంతో సహచరులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొదట ఆరోగ్యం కుదుటపడినట్లు కనిపించినా.. ఆదివారం రాత్రి మరోసారి పరిస్థితి విషమించింది. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
సినిమాటోగ్రాఫర్‌గా షాజీ కుమార్ ప్రయాణం 2001లో విడుదలైన ‘ఉత్తమన్’ చిత్రంతో ప్రారంభమైంది. అంతకుముందు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ వద్ద సహాయకుడిగా పనిచేశారు. అప్పటి నుంచి తన కెమెరా పనితనంతో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల కెరీర్లో 50కి పైగా సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. మలయాళంతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ పనిచేశారు.
మోహన్‌లాల్ (Mohanlal) నటించిన ‘నరసింహం’, ‘నరన్’, ‘పులిమురుగన్’, ‘ఒడియన్’, ‘తుడరుమ్’ వంటి చిత్రాలకు జోషి, షాజీ కైలాస్, వినయన్, వైశాఖ్, తరుణ్ మూర్తి వంటి దర్శకులతో కలిసి ఆయన కెమెరా బాధ్యతలు నిర్వహించారు. వీటితో పాటు ‘పొక్కిరి రాజా’, ‘మధుర రాజా’, ‘రామలీలా’, ‘రింగ్ మాస్టర్’, ‘మన్యం పులి’, ‘పతోన్పతం నూటాండు’ వంటి సినిమాలకు కూడా పనిచేశారు. ముఖ్యంగా ‘పులిమురుగన్’ మలయాళంలో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలవడంలో ఆయన సినిమాటోగ్రఫీ కూడా కీలక పాత్ర పోషించింది.
ఇదిలాఉంటే.. మరణించే సమయానికి కూడా ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’, సురేశ్ గోపీ చిత్రం ‘ఒట్టకొంబన్’తో పాటు దిలీప్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు కూడా పని చేస్తున్నారు. షాజీ కుమార్‌కు భార్య స్మిత, కుమారులు ఆర్యన్, సూర్యన్ ఉన్నారు. ఆయన మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఓ ప్రతిభావంతుడైన సినిమాటోగ్రాఫర్‌ను కోల్పోయింది.