అవరాచన్ అండ్ సన్స్.. తండ్రిని పెంచే కొడుకుల కథ.. చివరి ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్
ABN, Publish Date - Nov 02 , 2026 | 05:43 PM
గత శుక్రవారం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ (Netflix) లో ఎన్నో మంచి సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చాయి. అందులో ఒకటి 'అవరాచన్ & సన్స్' (Avarachan & Sons).
గత శుక్రవారం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ (Netflix) లో ఎన్నో మంచి సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చాయి. అందులో ఒకటి 'అవరాచన్ & సన్స్' (Avarachan & Sons). మలయాళ నటుడు బిజు మీనన్, శ్రీనాథ్ భాసి, గణపతి ఎస్. పొదువాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి థంబి, జోసెఫ్ విజీష్ కథను అందించగా, సనల్ దేవ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంది.ఆ తరువాత సైలెంట్ గా అక్టోబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనేది చూద్దాం.
కథ ఏంటంటే.. అవరాచన్ (బిజు మీనన్) బాధ్యతలు అన్నీ ఉన్నా.. మద్యానికి బానిసైన ఒక తాగుబోతు. అతనికి ఇద్దరు కొడుకులు.. జైసన్ (శ్రీనాథ్ భాసి), జైమోన్ (గణపతి ఎస్. పొదువాల్). పెద్ద కొడుకుకు పెళ్లి అవుతుంది. రెండో కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ, ఆ సంబంధం తండ్రి మంచివాడు కాదని ఒకరు చెప్పడంతో చెడిపోతుంది. కొడుకు పెళ్లిని చెడగొట్టినవారిని అవరాచన్ అవమానిస్తాడు. దీంతో వారు అవరాచన్ కుటుంబంపై పగబడతారు. ఇక చేసేది లేక కొడుకులు.. తండ్రిని అతని అక్క ఇంటికి పంపిస్తారు. అక్కడ కూడా అతని ప్రవర్తన మారదు. మరి చివరకు అవరాచన్ ఎలా మారాడు.. ? అతనిలోని మార్పుకు కారణం ఎవరు.. ? తండ్రి కోసం కొడుకులు చేసిన పని ఏంటి అనేది సినిమా చూసే తెలుసుకోవాలి.
సాధారణంగా ఒక వయస్సు వచ్చాక పెద్దవాళ్ళు.. చిన్నవాళ్ళుగా మారతారు. బాధ్యతలు అన్ని మరిచి మనవళ్లు, మనవరాళ్ళతో ఆడుతూ ఉంటారు. ఇది అందరికీ తెల్సిందే. అయితే ఎంత వయస్సు వచ్చినా బాధ్యత మర్చిపోయిన తండ్రులు కూడా సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఒక తండ్రి కథనే అవరాచన్ & సన్స్. మొదటి భాగం అంతా అవరాచన్ తాగడం, గొడవలు, ఇంటి పరిస్థితులు అలా స్లోగా నడుస్తుంది. ఇక ఎప్పుడైతే కొడుకు పెళ్లి చెడగొట్టిన వ్యక్తిని అవరాచన్ అవమానిస్తాడో అప్పటి నుంచి కథ మలుపు తిరుగుతుంది. తన అక్క వాళ్ళింటికి వెళ్ళడం, అక్కడ కూడా అతనిలో మార్పు రాకపోవడంతో.. అస్సలు ఇతను ఎప్పుడు మారతాడు అని కొడుకులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.
అక్క చెప్పడంతో తన వ్యసనాన్ని వదిలించుకోవడానికి డీ-అడిక్షన్ సెంటర్కు వెళ్లడం, అక్కడ కొద్దిగా మార్పు కనిపించినా ఇంటికి రాగానే మళ్లీ పాత అలవాటు వైపు వెళ్లడం వంటి సన్నివేశాలు జీవితంలోని వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపుతాయి. మార్పు అనేది ఒక్క నిర్ణయంతో వచ్చేది కాదని, దాని వెనుక ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వయస్సు పెరిగిన తల్లిదండ్రులను కొడుకులు ఎలా చూసుకుంటున్నారు అనేది అవరాచన్ కి అర్ధమైనప్పుడు, అక్క ఒంటరిగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఒక తండ్రిగా అతను పడే బాధను ఎంతో అద్భుతంగా చూపించారు. అయితే సినిమా అంతా ప్లాట్ గా సాగిపోతుంది. పెద్ద ట్విస్ట్ లు ఏమి ఉండవు. అందులో స్లోగా సాగే కథనం కావడంతో చాలా బోర్ ఫీల్ ఉంటుంది. కానీ, చివరి ట్విస్ట్, ఒక సీనియర్ హీరోయిన్ క్యామియో నవ్వులు పూయిస్తుంది.
అవరాచన్ పాత్రలో బిజు మీనన్ అద్భుతంగా నటించాడు. ఎక్కడా అతి లేని నటనతో, కేవలం కళ్లలోని భావాలతో, చిన్న మౌనంతో ఆయన పండించిన హావభావాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. తమ తండ్రిని పెంచాల్సిన విపత్కర పరిస్థితి ఎదురైన ఇద్దరు కొడుకుల పాత్రలు కూడా కథకు ప్రధాన బలంగా నిలిచాయి. తేలికపాటి హాస్యం, తండ్రి పట్ల ఉండే పశ్చాత్తాపం, అనుబంధాల మధ్య నడిచే ఈ కథని కొంచెం ల్యాగ్ అనిపించినా.. ఒక ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామాను, లైఫ్ జర్నీని ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక చక్కటి ఆప్షన్.