Malluwood: మే 14న రెండు మలయాళ డబ్బింగ్ చిత్రాలు
ABN, Publish Date - Jan 19 , 2026 | 05:21 PM
తెలుగులో మలయాళ అనువాద చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే 14న 'కాటాలన్, అతిరథి' సినిమాలు కూడా తెలుగులో విడుదల కాబోతున్నాయి.
తెలుగులో యేడాదికి దాదాపు వంద సినిమాలు డబ్ అయితే అందులో అధికశాతం తమిళ అనువాద చిత్రాలే ఉండేవి. ఆ తర్వాత స్థానంలోనే కన్నడ, మలయాళ, హిందీ, ఆంగ్ల భాషా చిత్రాలు ఉంటాయి. అయితే చిత్రంగా కొంతకాలంగా మలయాళ అనువాద చిత్రాలు ఎక్కువగానే తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్నాయి. తాజాగా ఒకే రోజున రెండేసి మలయాళ చిత్రాలు వస్తున్న పరిస్థితి కూడా వచ్చేసింది. గత యేడాది మూడు నాలుగు వారాల్లో ఇలా రెండేసి మలయాళ చిత్రాలు వచ్చాయి. అలానే ఈ యేడాది కూడా మే 14న రెండు మలయాళ అనువాద చిత్రాలు తెలుగువారి ముందుకు రాబోతున్నాయి. తెలుగులో ఇంతవరకూ ఆ డేట్ ను ఏ మూవీ కూడా లాక్ చేయలేదు. కానీ మలయాళ చిత్రాలు 'కాటాలన్' (Kattalan), 'అతిరథి' ఆ రోజున వస్తున్నట్టు ప్రకటనలు వచ్చాయి.
టొవినో థామస్ (Tovino Thomas) కు ఇప్పుడు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ కూడా అతని అభిమానులు బాగానే ఉన్నారు. అతనితో పాటు బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ (Vineeth Sreenivasan) ప్రధాన పాత్రలు పోషించిన 'అతిరథి' (Athiradi) మే 14న వస్తోంది. ఇందులో దర్శన రాజేంద్రన్, జరీనా షిహాబ్, రియా షిబు ఫిమేల్ లీడ్ రోల్స్ చేశారు. 'మిన్నల్ మురళీ' సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేసిన అరుణ్ అనిరుధ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమాను ఓనం కానుకగా విడుదల చేస్తామని మొదట చెప్పారు కానీ ఇప్పుడు ప్రీ పోన్ చేశారు. ఇక మే 14న వస్తున్న మరో సినిమా 'కాటాలన్' విషయానికి వస్తే ఈ సినిమాతో పాల్ జార్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'మార్కో' సినిమాను నిర్మించిన షరీఫ్ మహమ్మద్ ఈ సినిమా నిర్మాత. ఏనుగుల వేట నేపథ్యంలో 'కాటాలన్' మూవీ రూపుదిద్దుకుంటోంది. ఆంటోనీ వర్గీస్ ఈ సినిమాలో హీరో. ఓంగ్ - బాక్ సిరీస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాంగ్ అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించబోతోంది. బి. అజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న 'కాటాలన్'లో సునీల్ (Sunil), కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు, 'కిల్' ఫేమ్ పార్థ్ తివారి ప్రధాన పాత్రలు పోషించారు. మరి మే 14న రాబోతున్న ఈ మలయాళ డబ్బింగ్ సినిమాలు తెలుగువారిని ఏ రీతిన ఆకట్టుకుంటాయో చూడాలి.