సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Malavika Mohanan: విజయ్‌తో సినిమా.. మాళవికకు త్రిష మెసేజ్ ఇదే..

ABN, Publish Date - Sep 08 , 2026 | 11:15 AM

సినీ పరిశ్రమలో కొత్తవారిని ప్రోత్సహించే మనస్తత్వం ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్‌ అన్నారు.

సినీ పరిశ్రమలో కొత్తవారిని ప్రోత్సహించే మనస్తత్వం ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్‌ అన్నారు. ముఖ్యంగా నటి త్రిష లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారని ఆమె ప్రశంసించారు. తాను కెరీర్‌ ప్రారంభించిన సమయంలో త్రిష చూపించిన ఆప్యాయత, ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ప్రస్తుతం మాళవిక మోహనన్‌ ‘సర్దార్‌ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తి కథానాయకుడిగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక కీలక పాత్ర పోషించారు. ఆషికా రంగనాథ్‌ మరో కథానాయికగా నటించగా.. ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాళవిక.. త్రిషతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

 "కెరీర్‌ ప్రారంభంలోనే రజనీకాంత్‌ నటించిన ‘పేట’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ  అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. రజనీకాంత్‌ లాంటి సూపర్‌స్టార్‌ సినిమాలో నటిస్తున్నాననే ఉత్సాహం ఉన్నప్పటికీ.. కమర్షియల్‌ సినిమా చేసిన అనుభవం లేకపోవడంతో కొంత భయపడ్డాను. వారణాసిలో షూటింగ్‌ జరిగిన సమయంలో త్రిషతో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించాను. అప్పుడే మా మధ్య మంచి పరిచయం ఏర్పడింది. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నేను కొత్తగా వచ్చిన అమ్మాయిననే భావన కలగకుండా ప్రతి విషయంలోనూ నన్ను భాగం చేసేవారు. చాలా ప్రేమగా పలకరించేవారు. ఆమెతో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఎంతో ప్రత్యేకం. ఇండస్ట్రీలో చాలామంది తమ పని తాము చేసుకుని వెళ్లిపోతుంటారు.. కానీ త్రిష మాత్రం కొత్తవారిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఇతరుల ఎదుగుదలను చూసి సంతోషించడం, కొత్తవారిని ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు’’ అని చెప్పారు.

విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్టర్‌’లో అవకాశం వచ్చినప్పుడు కూడా త్రిష తనను ప్రత్యేకంగా అభినందించారని మాళవిక తెలిపారు. ‘‘నాకు ‘మాస్టర్‌’లో అవకాశం వచ్చినప్పుడు త్రిష ప్రత్యేకంగా మెసేజ్‌ చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. నా విజయం పట్ల ఆమె నిజంగా సంతోషించారు. అలా అభినందించడానికి ఎంతో పెద్ద మనసు కావాలి’’ అని పేర్కొన్నారు. 

Updated Date - Sep 08 , 2026 | 11:57 AM