ఇండియన్ 3 ఎఫెక్ట్.. కోర్టుకు లైకా! శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అటకెక్కినట్లేనా?
ABN, Publish Date - Mar 17 , 2026 | 12:46 PM
నిన్నటి వరకు అగ్ర దర్శకుడిగా వెలిగిపోయిన శంకర్, నేడు తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. అసలు శంకర్ పరిస్థితి ఇలా ఎందుకు మారింది?
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూసేది. కానీ, దక్షిణాది సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన అతికొద్ది మంది దర్శకుల్లో శంకర్ (Shankar) పేరు మొదటి వరుసలో ఉండేది. గ్రాండియర్ అంటే శంకర్.. విజువల్ వండర్ అంటే శంకర్. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి వరకు అగ్ర దర్శకుడిగా వెలిగిపోయిన శంకర్, నేడు తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. అసలు శంకర్ పరిస్థితి ఇలా ఎందుకు మారింది? ఒకప్పుడు శంకర్ వెంట పడ్డ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి భయపడే పరిస్థితి వచ్చేసింది.
శంకర్ అంటే కేవలం భారీ బడ్జెట్ మాత్రమే కాదు, సామాజిక అంశాలను కమర్షియల్ హంగులతో చూపించే ఒక మాస్టర్ మైండ్. జెంటిల్‌మెన్ నుంచి రోబో వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ఒక సంచలనం. అయితే, రోబో 2.ఓ చిత్రం నుంచి ఆయన గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతూ వస్తోంది. ఒకప్పుడు ఆయన డేట్స్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు, ఇప్పుడు ఆయన పేరు వింటేనే ఆందోళన చెందుతున్నారు.
శంకర్ గత చిత్రాలైన భారతీయుడు 2 (Bharateeyudu), రామ్ చరణ్ (Game Changer) తో తీసిన గేమ్ చేంజర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఈ సినిమాలు కేవలం పరాజయం పాలవ్వడమే కాకుండా, నిర్మాతలకు వందల కోట్ల నష్టాలను మిగిల్చాయి. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు శంకర్ మార్క్ మిస్ అయిందని పెదవి విరిచారు. విజువల్స్ పైన పెట్టిన శ్రద్ధ కథనం మీద పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. భారతీయుడు సిరీస్‌ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) సంస్థ ఇప్పుడు శంకర్ పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిన భారతీయుడు 3ని శంకర్ మధ్యలోనే వదిలేశారనేది వారి ప్రధాన ఆరోపణ. భారతీయుడు 3 షూటింగ్ పూర్తి చేసే వరకు శంకర్ మరో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి వీల్లేదని వారు గట్టిగా తేల్చి చెప్పారు. సినిమా రిజల్ట్ పై నమ్మకం లేకనో ఏమో కానీ, భారతీయుడు 3ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
ఇది ఒక స్టార్ డైరెక్టర్ కెరీర్‌లో ఎదురయ్యే అతిపెద్ద అవమానంగా భావించవచ్చు. ఇదిలా ఉంటే శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరి (Velpari). భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ డ్రామాగా దీనిని తెరకెక్కించాలని ఆయన ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్మాత కూడా అంత భారీ రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. అంతేకాకుండా, స్టార్ హీరోలు సైతం శంకర్‌తో పనిచేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
క్రేజ్ తగ్గడం ఒకెత్తయితే, సినిమా పూర్తి కావడానికి తీసుకునే సుదీర్ఘ కాలం హీరోల కాల్షీట్లను ఇబ్బందుల్లో పడేస్తోంది. ఒక దర్శకుడిగా శంకర్ ప్రతిభను ఎవరూ శంకించలేరు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీతో పాటు కథలో బలాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి భారతీయుడు 3తో తను పోగొట్టుకున్న వైభవాన్ని శంకర్ తిరిగి తెచ్చుకుంటారా..? వివాదాల నుంచి బయటపడి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారా? అన్నది వేచి చూడాలి.