తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ
ABN, Publish Date - Aug 18 , 2026 | 04:32 PM
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్‌లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు
తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన LCU బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) , మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో పాన్ -ఇండియా రేంజ్‌లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఆయన దర్శకత్వంలో దళపతి విజయ్‌తో చేసిన లియో, రజనీకాంత్‌తో చేసిన కూలీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. కథ, సెకండ్ హాఫ్ స్క్రీన్‌ప్లే లోపాల వల్ల సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాయి. ఇక ఆ ట్రోల్స్ ని తట్టుకొని DC సినిమాతో హీరోగా పరిచయమై భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లోకేష్ .. అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ట్రోలింగ్ నడుస్తూనే ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #AA23 చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, అనిరుధ్ రవిచందర్ సంగీతంలో రాబోతున్న ఈ సినిమా, అత్యంత వినూత్నమైన కాన్సెప్ట్, హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందనుంది. ఇటీవల లోకేష్ నటించిన చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ లోకేష్‌ను అభినందించడం, వీరి కాంబినేషన్ మూవీపై ఉన్న క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై లోకేష్ కనగరాజ్ చాలా హుందాగా, స్పష్టంగా స్పందించాడు. 'మా అమ్మ కూడా నాకు సంబంధించిన ఆ ట్రోల్స్, మీమ్‌లను స్క్రీన్‌షాట్లు తీసి పంపుతుంటుంది. ఇందులో కంగారు పడటానికి ఏమీ లేదు. మన పని బాగుంటే ప్రేక్షకులు మనల్ని నెత్తిన పెట్టుకుని వేడుక చేసుకుంటారు. కానీ చిన్న పొరపాటు జరిగితే ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. నా మునుపటి రెండు సినిమాలు విషయంలో కొన్ని తప్పులు జరిగాయి, అందుకే ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ సినిమా విడుదలైనప్పుడు ఈ ట్రోల్స్ అన్నీ వాటంతట అవే ఆగిపోతాయి" అంటూ లోకేష్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక లోకేష్ వ్యాఖ్యలపై బన్నీ స్పందించాడు. మై డైరెక్టర్ అంటూ ప్రశంసించాడు. బన్నీనే శభాష్ అన్నాడు అంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.