అప్పుడు 'రాక్షసుడు'... ఇప్పుడు 'రాక్షసపురం'!
ABN, Publish Date - Apr 10 , 2026 | 07:36 PM
డబ్బింగ్ సినిమాలతో ఐదు దశాబ్దాల క్రితం నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన కె.ఎస్. రామారావు ఇప్పుడో కన్నడ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. రాజ్ బి శెట్టి నటించిన కన్నడ సినిమాను తెలుగులో 'రాక్షసపురం' పేరుతో ఈ నెలాఖరులో విడుదల చేయబోతున్నారు.
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు (K.S. Ramarao) కెరీర్ డబ్బింగ్ సినిమాలతోనే మొదలైంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా నిర్మాతగా చిత్రసీమలో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు మరోసారి ఓ కన్నడ డబ్బింగ్ సినిమాను తెలుగువారి ముందుకు తీసుకు రాబోతున్నారు. రాజ్ బి శెట్టి (Raj B Shetty) హీరోగా నటించిన కన్నడ సినిమా 'రక్కసపురదోల్' ఫిబ్రవరి నెలలో కన్నడలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను 'రాక్షస పురం' (Rakshasa Puram) పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నట్టు కె.ఎస్. రామారావు తెలిపారు. ఈ తెలుగు టైటిల్ పోస్టర్ ఆయన ఎఫ్.ఎన్.సి.సి.లో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. 'రక్కసపురదోల్' సినిమాను కె. రవివర్మ కన్నడలో నిర్మించారు. రవి సారంగ దీనికి దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సినిమా తెలుగు వర్షన్‌కు కె.ఎస్. రామారావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, 'నా కెరీర్ డబ్బింగ్ చిత్రంతోనే ప్రారంభమైంది. కమల్ హాసన్ నటించిన 'ఎర్రగులాబీలు' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్లీ మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై 'రాక్షస పురం' అనే మూవీని తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నా. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రవి సారంగ అద్భుతంగా రూపొందించాడు. నా స్నేహితుడు రవివర్మ నిర్మించాడు. ఈ సినిమా చూశాక థ్రిల్ అయ్యాను. ప్రొడ్యూసర్ రవివర్మకు ఫోన్ చేసి నేను ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రంలో హీరో రాక్షస సంహారం చేస్తుంటాడు. అది ఒక ఊరిలో జరుగుతుంటుంది. అందుకే టైటిల్ 'రాక్షసపురం' అని పెట్టారు. నేను 1986లో చిరంజీవి గారితో (Chiranjeevi) 'రాక్షసుడు' (Rakshasudu) అనే చిత్రాన్ని రూపొందించాను. ఆ సినిమా టైటిల్ కొందరికి నెగిటివ్‌గా అనిపించింది. కానీ హీరో చేసేవన్నీ మంచి పనులే, కథ మంచిదే. హీరో విలన్స్‌కు రాక్షసుడు కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఈ 'రాక్షసపురం'లో కూడా హీరో రాక్షసుల్లాంటి విలన్స్‌ను సంహరిస్తాడు. ఒక డిఫరెంట్ సినిమా కాబట్టి, ఇప్పుడు ఉన్న ట్రెండ్‌కు నచ్చుతుంది. ఈ నెలాఖరులోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. 'రాక్షసపురం' మూవీని మీరంతా ఆదరించాలని కోరుతున్నా' అని అన్నారు.
ఈ సినిమాలో రాజ్ బి శెట్టి, స్వాతిష్ట, అర్చన కొట్టిగె, అనిరుధ్ భట్, బి. సురేఖ, గోపాలకృష్ణ దేశ్ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ సినిమాకు విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు.