సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kollywood: చిన్న చిత్రాలను వేధిస్తున్నథియేటర్ల సమస్య

ABN, Publish Date - Jan 03 , 2026 | 11:55 AM

కోలీవుడ్‌లో చిన్న బడ్జెట్‌, కొత్త హీరోల చిత్రాలకు థియేటర్ల కేటాయింపు గగనమైపోయింది. థియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకున్న ప్రముఖ మల్టీప్లెక్స్‌ గ్రూపు చిన్న చిత్రాలకు థియేటర్లు కేటాయించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి.

కోలీవుడ్‌లో (kollywood) చిన్న బడ్జెట్‌(Small budget movies), కొత్త హీరోల చిత్రాలకు థియేటర్ల కేటాయింపు గగనమైపోయింది. థియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకున్న ప్రముఖ మల్టీప్లెక్స్‌ గ్రూపు చిన్న చిత్రాలకు థియేటర్లు కేటాయించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. దీంతో తీవ్ర నిరాశకు లోనవుతున్న చిన్న నిర్మాతలు తమ చిత్రాన్ని ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. కొత్త సంవత్సరం జనవరి తొలి శుక్రవారం 2వ  తేదీన ఆరు చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో చాలా చిత్రాలకు పది లోపే థియేటర్లను కేటాయించడం గమనార్హం. ‘జస్టిన్‌ ఫర్‌ జెనీ’ మూవీకి చెన్నై నగరంలో 9 థియేటర్లలో విడుదల చేయగా, 8 థియేటర్లలో ఒకే ఒక్క షో  ప్రదర్శిస్తున్నారు. ఒక్క హాలులో మాత్రం 2 ఆటలు వేస్తున్నారు. అలాగే, ‘కాక్కా’ మూవీకి 14 థియేటర్లు కేటాయించగా, 13 థియేటర్లలో ఒక్క షో, మరో థియేటర్‌లో రెండు షోలు ప్రదర్శిస్తున్నారు. 

శ్రీకాంత్‌ - సృష్టి డాంగే నటించిన ‘ది బెడ్‌’ మూవీకి 14 థియేటర్లలో విడుదలకాగా, 13 థియేటర్లలో ఒక షో, ఒక థియేటర్‌లో రెండు షోలు, ‘డియర్‌ రది’ మూవీకి 16 థియేటర్లు దక్కగా అన్నింటిలో ఒక్కో షో వేస్తున్నారు. ‘అనలి’ మూవీకి 9 థియేటర్లు కేటాయించగా, ఎనిమిదింట ఒక షో, ఒక థియేటర్‌లో రెండు షోలు ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్‌ కామాక్షి నిర్మించిన ‘సల్లియర్‌గల్‌’ మూవీకి థియేటర్లు దక్కక పోవడంతో ఆయన ఓటీటీలో రిలీజ్‌ చేశారు.  చిన్న బడ్జెట్‌ చిత్రాలకు, అగ్రహీరోల చిత్రాలకు ఏ విధంగా సినిమా టిక్కెట్ల ధరలు ఉంటాయో వాటినే అమలు చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ పెరగాలంటే సినిమా టిక్కెట్‌ రేట్లను  తగ్గించాలని నిర్మాతలు కోరుతున్నారు. ఒక యేడాదిలో దాదాపు 12 భారీ బడ్జెట్‌ చిత్రాలు వస్తాయని, వాటికి వసూలు చేసే సినిమా టిక్కెట్‌ రేట్లను యేడాది పొడవున విడుదలయ్చే చిన్న చిత్రాలకు వసూలు చేస్తే ఎలా అని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. చిత్ర పరిశ్రమతో పాటు చిన్న నిర్మాతల మనుగడను దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధరను పునఃసమీక్ష చేయాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన నిర్మాతల మండలి నోరు మెదపడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. చిన్న నిర్మాతలను రక్షిస్తేనే చిత్ర పరిశ్రమ మనుగడ సాగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - Jan 03 , 2026 | 12:10 PM