Kiran Abbavaram: కిరణ్ అబ్బవరాన్ని వెంటాడుతున్న కోలీవుడ్?.. అదే సీన్ రిపీట్
ABN, Publish Date - Jul 16 , 2026 | 01:13 PM
కిరణ్ అబ్బవరం ప్రయాణంలో కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు పదేపదే అడ్డంకిగా మారుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా, అభిమానుల్లో ఇదే చర్చ కొనసాగుతోంది.
సినిమా నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న ఆయన సినీ ప్రయాణంలో మాత్రం కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు పదేపదే అడ్డంకిగా మారుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా, అభిమానుల్లో ఇదే చర్చ కొనసాగుతోంది.
'ఎస్‌ఆర్ కళ్యాణ మండపం' విజయంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయారు. దీంతో ఆయన ఆశలన్నీ 'క' (KA) సినిమాపైనే పెట్టుకున్నారు. అయితే ఆ చిత్రం విడుదలైన రోజే తమిళ స్టార్ శివకార్తికేయన్ నటించిన 'అమరన్' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన 'అమరన్' పోటీ ఉన్నప్పటికీ 'క' మంచి వసూళ్లు సాధించి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన 'దిల్‌రుబా' ఆశించిన ఫలితాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అనంతరం వచ్చిన 'కే-ర్యాంప్' (K-Ramp) విడుదలకు ఒక్క రోజు ముందే తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' (Dude) విడుదలైంది. రెండు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందినప్పటికీ, వసూళ్ల పరంగా 'డ్యూడ్' పైచేయి సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' జూలై 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి కూడా ఆయన సినిమాకు భారీ పోటీ తప్పేలా కనిపించడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకన్' జూలై 23న విడుదల కానుంది. దీంతో మరోసారి కిరణ్ సినిమా కోలీవుడ్ భారీ చిత్రంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సినీ వర్గాల్లో మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 'జన నాయకన్' చిత్రం బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా వస్తోందని, ఆ కథ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడంతో 'చెన్నై లవ్ స్టోరీ'పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని చెబుతున్నారు. మరి ఈసారి కిరణ్ అబ్బవరం కోలీవుడ్ పోటీని అధిగమించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారా? లేక భారీ చిత్రాల ప్రభావం పడుతుందా? అన్నది తెలియాలంటే జూలై 24 వరకు వేచి చూడాల్సిందే.