Khushboo: మా ఇద్దరి మధ్య రిలేషన్ ఎలాంటిదంటే..
ABN, Publish Date - May 28 , 2026 | 11:13 AM
సినీ హీరో, ముఖ్యమంత్రి విజయ్‌కు, తనకు మధ్య ఉన్న సంబంధం బ్రదర్ సిస్టర్ రిలేషన్ వంటిదని సీనియర్ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ స్పష్టం చేశారు.
సినీ హీరో, ముఖ్యమంత్రి విజయ్‌కు, తనకు మధ్య ఉన్న సంబంధం బ్రదర్ సిస్టర్ రిలేషన్ వంటిదని సీనియర్ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ స్పష్టం చేశారు. ఖుష్బూ, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘డబుల్ ఆక్యుపెన్సీ’. సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్తా విశ్వనాథన్, వినోద్ కిషన్, వీటీవీ గణేష్, భగవతి పెరుమాల్, బోస్ వెంకట్, వినోదిని వైద్యనాథన్ తదితరులు నటించారు. డెబ్యూ డైరెక్టర్ అశ్విన్ కందస్వామి దర్శకుడు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ఆడియో రిలీజ్ వేడుక మంగళవారం రాత్రి చెన్నైలో జరిగింది.
ఖుష్బూ మాట్లాడుతూ ‘సీఎం విజయ్, నేను వేర్వేరు పార్టీలకు చెందినవాళ్ళం అయినప్పటికీ.. మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ మూవీ. సంతోష్, ఆనంతిక మంచి స్నేహితులు. నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు. కానీ, సంతోష్ వంటి అందమైన అబ్బాయి ఉన్నాడు. ఈ స్టోరీలో మంచి కథతో పాటు కామెడీ, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీ నేను వినలేదు. మా బ్యానరులో సంతోష్ ను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఒక తల్లిగా గర్వపడుతున్నాను. అతనిలో ఫ్యాషన్, సినిమా పిచ్చి ఇలా అన్నీ ఉన్నాయి’ అని అన్నారు.
చిత్ర పరిశ్రమలోకి ఆనందిత..
దర్శకుడు సుందర్, నటి ఖుష్బూ దంపతుల రెండో కుమార్తె ఆనందిత సినిమాల్లోకి అడుగుపెట్టారు. విదేశాల్లో విద్య పూర్తి చేసిన ఆమె.. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అయితే, ఆ చిత్ర టైటిల్ కార్డులో ఆమె పేరు వేయలేదు. ఇప్పుడు ‘డబుల్ ఆక్యుపెన్సీ’ చిత్రానికి ఆమె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, ‘నేను లండన్‌లో చదువుకున్నాను. మణిరత్నం టీమ్‌లో పనిచేశాను. అమ్మానాన్నల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. సొంత బ్యానరుపై సినిమాల నిర్మాణ వ్యయం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ‘డబుల్ ఆక్యుపెన్సీ’లో అమ్మ నటించారా? లేదా? అన్నది ఇప్పటికి సస్సెన్స్. మా బ్యానరుపై మున్ముందు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే పలు చిత్రాలను నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.