శ్రీవిష్ణు: 'యూత్'... మనసులు గెలుచుకుంటుంది!
ABN, Publish Date - Mar 25 , 2026 | 02:06 PM
కెన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'యూత్' సినిమా ఈ నెల 26న తెలుగులో విడుదల కాబోతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు హీరోలు, దర్శకులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
కెన్ కరుణాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ మూవీ 'యూత్'. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ఈ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీవిష్ణు, సత్యదేవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ఠ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, 'నా 'సింగిల్' మూవీకి తమిళ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో కెన్‌ను చూశాను. చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇప్పుడు హీరోగా మారి 'యూత్'తో మన ముందుకు వస్తున్నాడు. సందీప్, వినీత్ వల్లే నేను నా మూవీస్‌కు డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేసుకోగలిగాను. ఇంజనీరింగ్ నుంచి సినిమాకు వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ. ఈ సినిమా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడండి. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు' అని అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, 'సందీప్, వినీత్ 'యూత్' మూవీ కోసం చాలా కష్టపడ్డారు. డబ్బింగ్, సాంగ్స్ పాడించడం, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఎన్నో సినిమాల ఎఫర్ట్ ను ఈ ఒక్క చిత్రానికే పెట్టారు. వీళ్లిద్దరికీ సినిమా అంటే పిచ్చి. ప్రతివారం వీళ్లు ప్రమోట్ చేసే చిత్రాలు రిలీజ్‌కు వస్తుంటాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌గా మన ముందుకు వస్తున్నారు. తమిళంలో లాగే తెలుగులోనూ 'యూత్' మూవీ హిట్ కావాలి. కెన్ అండ్ గ్యాంగ్ చేసిన సూపర్బ్ పర్‌ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది' అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన సందీప్ మాట్లాడుతూ, 'తమిళంలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇంజనీరింగ్ టు సినిమా అని ఈ2సీ బ్యానర్ పేరు ఎప్పుడు పెట్టుకున్నామో గానీ మాకు పరీక్షలు రాసినట్టుగానే ఉంది. మంచి మార్కులతో ఈ నెల 26న పాస్ అవుతామని నమ్ముతున్నాం' అని అన్నారు. మరో నిర్మాత వినీత్ మాట్లాడుతూ, 'ఈ సినిమాను ఒక్కరే చూస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో థియేటర్స్‌కు వెళితే మరింత ఎంజాయ్ చేస్తారు' అని చెప్పారు. 'రఘువరన్ బీటెక్' మూవీని ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరూ తమ చిత్రాన్నీ ఎంజాయ్ చేస్తారని, సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్‌ను సపోర్ట్ చేసినట్టుగానే తమనూ ఆదరించాలని హీరో కమ్ డైరెక్టర్ కెన్ కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు సాయి రాజేశ్, హసిత్ గోలి, నిర్మాత శరత్ చంద్ర, నటుడు సూరజ్ వెంజరముడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీశ్, హీరోయిన్లు మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్, అనిష్మ అనిల్ కుమార్, సంగీత దర్శకుడు జై క్రిష్, వినయ్ రత్నం, గీత రచయిత సనరే తదితరులు సినిమా విజయంపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
26న కాదు... 27న విడుదల
'యూత్' సినిమా విడుదలను ఒక రోజు వెనక్కి జరుపుతున్నట్టు మేకర్స్ బుధవారం మధ్యాహ్నం తెలిపారు. అలానే పెయిడ్ ప్రివ్యూస్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా త్వరలోనే తెలియచేస్తామని అన్నారు. మార్చి 26, గురువారం విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా ఇప్పుడు 27వ తేదీ శుక్రవారం తెలుగు వారి ముందుకు రాబోతోంది.