Keerthy Suresh: దశాబ్దం తర్వాత టిఫ్‌లో తమిళ సినిమా.. ‘డోరతి’కి స్టాండింగ్ ఒవేషన్!
ABN, Publish Date - Sep 13 , 2026 | 09:10 AM
కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘డోరతి’. ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కీర్తి సురేశ్(Keerthy Suresh), సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘డోరతి’(Dorathi). ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్, జ్యోతిదేశ్‌పాండే సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలున్నాయి. తాజాగా అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది ఈ సినిమా. కెనడాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (TIFF) 2026లో ‘డోరతి’ ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి తమిళ చిత్రంగా ‘డోరతి’ నిలవడం మరో విశేష అంశం. దీంతో ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించినట్లైంది. ఈ సినిమా వీక్షించిన అనంతరం ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించడం మరింత ఆనందాన్ని కలిగించిందని మేకర్స్ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘ఈ క్షణాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఎంతో అవసరం. ఈ చిత్రానికి జీవం పోసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అంటూ భావోద్వేగంతో క్యాప్షన్ ఇచ్చారు.
1990ల కాలం నేపథ్యంలో సాగే కథగా ‘డోరతి’ రూపొందింది. చిన్ననాటి నుంచి స్నేహంగా ఉన్న ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి ‘డోరతి’ అనే మహిళ ప్రవేశించిన తర్వాత చోటుచేసుకునే పరిణామాల చుట్టూ కథ సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. స్నేహం, బాల్యం, మానవ సంబంధాలు, భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ కథను తెరకెక్కిస్తున్నారు.