మన సంస్కృతిని.. తక్కువ చేయను! హీరోలు తాకితే నవ్వామని.. బయట కూడా అలాగే ఉండాలా? కీర్తి సురేశ్ ఫైర్
ABN, Publish Date - Nov 20 , 2026 | 05:44 AM
'ఉత్తరాదికి వెళ్లినంత మాత్రాన, మన సంస్కృతిని అక్కడ తక్కువ చేయను' అని అన్నారు కీర్తి సురేశ్.
'ఉత్తరాదికి వెళ్లినంత మాత్రాన, మన సంస్కృతిని అక్కడ తక్కువ చేయను' అని అన్నారు కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఆమె నటించిన 'అక్క' సిరీస్ (Akka Series) లో రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇద్దరూ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఓ చిత్రంలో తనకన్నా వయసులో పెద్దవాడైన మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటూ రాధికా ఆప్టే వ్యంగ్యంగా మాట్లాడారు. అప్పుడు పక్కనే ఉన్న కీర్తి సురేశ్ నవ్వుతూ కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి సంబంధించి తాజాగా కీర్తి స్పందించారు.
'ఇంటర్వ్యూలో రాధిక 'అంకుల్' అని ప్రస్తావించినప్పుడు నాకు విషయం అర్థం కాలేదు. తర్వాత ఆమె మాటలను బట్టి మేనమామను పెళ్లి చేసుకునే విషయం గురించి మాట్లాడుతున్నారని తెలుసుకున్నా. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఉంది. కేరళలో లేదు. కర్ణాటక గురించి నాకు అవగాహన లేదు. ఈ విషయాన్నే నేను ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను. నా సంస్కృతిని ఎవరైనా కించపరిస్తే చూస్తూ కూర్చోను. మన సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాను. ఇలాంటి సందర్భాల్లో అవతలి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించగలనే తప్ప, 'మీరు ఇలా మాట్లాడకూడదు' అని అనలేను. అక్కడికక్కడ నేను సంస్కృతి, సంప్రదాయాల గురించి వాళ్లకి ప్రూఫులతో నిరూపించలేను. అందుకే చక్కగా మాటల్లో వివరించా' అని అన్నారు.
అలా ఉండాలా? : 'డోరతి' ప్రెస్‌మిట్‌లో కీర్తి సురేష్‌ను ప్రశంసిస్తూ మిస్కిన్ ఆమెను మోకాలు పైభాగాన తాకారు. వెంటనే తాము తండ్రీ కూతుళ్లలాంటి వారమని అక్కడే ప్రకటించారు. 'సినిమాల్లో హీరోలు తాకితే నవ్వుతూ ఉంటావు. ఇక్కడ మిస్కిన్ టచ్ చేస్తే ముఖం ఎందుకలా పెట్టావ్' అంటూ కీర్తిని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అందుకు కీర్తి 'నేను ముఖం అదోలా పెట్టానని మీరెలా అంటారు? మా బంధం ఎలాంటిదో మిస్కిన్ మాటలను బట్టి అర్థం కాలేదా? మరో విషయం.. నటించేటప్పుడు హీరోలు తాకితే నవ్వు తున్నామని, సొసైటీలోనూ అలాగే ఉండాలా?' అంటూ ఘాటుగా స్పందించారు.