Keerthy Suresh: మన సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడను:
ABN, Publish Date - Nov 19 , 2026 | 11:45 AM
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇటీవల టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ వివాదంపై స్పందించారు.
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే (Radhika Apte) ఇటీవల టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఈ వివాదంపై స్పందించారు. అప్పట్లో రాధికా ఆప్టే మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని వెల్లడించారు.
ఆ సందర్భంలో రాధికా ఆప్టే తన సినీ ప్రయాణంలో ఎదురైన ఓ అనుభవాన్ని ప్రస్తావించారు. ఓ తెలుగు చిత్రంలో తనకంటే ఎక్కువ వయసున్న కథానాయకుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, సినిమాలో మేనమామను వివాహం చేసుకునే పాత్రలో నటించానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె ఈ విషయం చెబుతున్న సమయంలో పక్కనే ఉన్న కీర్తి సురేశ్ నవ్వుతూ కనిపించడంతో ఆమెపైనా కొందరు విమర్శలు గుప్పించారు.
ఈ వివాదంపై తాజాగా ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ప్రమోషన్లలో కీర్తి సురేశ్ స్పందించారు. ‘‘రాధికా ఆప్టే మాట్లాడినప్పుడు ఆమె ఉద్దేశం మొదట నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె మన దక్షిణాది సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారని తెలుసుకున్నాను. మన సంస్కృతి, ఆచారాలను నేను ఎప్పటికీ తక్కువ చేసి చూడను. ఉత్తరాది వారికి మన దక్షిణాది సంప్రదాయాల గురించి పూర్తి అవగాహన లేకపోవచ్చు’’ అని కీర్తి సురేశ్ స్పష్టం చేశారు.