కార్మేని సెల్వం: మధ్యతరగతి కుటుంబ కథ..
ABN, Publish Date - Mar 26 , 2026 | 05:50 PM
సముతిరకని ప్రధాన పాత్ర పోషించిన 'కార్మేని సెల్వం' ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగు వర్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు నిర్మాతగా, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముతిరకని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియ, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తెలుగు దర్శకులు ‘విమానం’ ఫేమ్ శివప్రసాద్, ‘రామం రాఘవం’ ఫేమ్ ధనరాజ్, ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను అతిథులుగా హాజరయ్యారు. తొలుత శివ ప్రసాద్ మాట్లాడుతూ, ‘మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ అనగానే మొదట గుర్తొచ్చేది సముతిరకని గారి పేరే. ఈ కథ చూస్తుంటే డబ్బు చుట్టూ తిరుగు తుందనిపిస్తోంది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు. తేజ కాకుమాను మాట్లాడుతూ, 'భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు. ధనరాజ్ మాట్లాడుతూ ‘ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
సముతిరకని మాట్లాడుతూ, ‘మనం లైఫ్‌ను చూసే విధానాన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్‌గా చూపించబోతున్నాం. రామ్ చక్రి వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఇలాంటి మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన తనకు థ్యాంక్స్. లక్ష్మీ ప్రియ, అభినయ నటన అందరికీ నచ్చుతుంది. థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎమ్‌ఐలను కూడా తక్కువ చేసుకోవాలను కుంటారు. మనపై ఉన్న బరువులను తగ్గించుకుంటేనే.. మన డ్రీమ్స్‌ను నెరవేర్చుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ వెల్త్‌గా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అని చెప్పే చిత్రమిది' అని అన్నారు.
సముతిరకని ఈ చిత్రంలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించబోతున్నారని, మ్యూజిక్‌ను కూడా సర్వీస్‌గా భావించి ఈ చిత్రానికి రామానుజం సంగీతం అందించారని దర్శకుడు రామ్ చక్రి తెలిపారు. ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉందని, సముతిరకని గారితో వర్క్ చేయడం గొప్ప అదృష్టమని అభినయ చెప్పింది. తాను పోషించిన శాంతి పాత్రతో ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారనే భావనను లక్ష్మీ ప్రియ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత రాంబాబు గోసాల, సంగీత దర్శకుడు రామానుజం, మ్యూజిక్ ప్రొడ్యూసర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.