Yash: ‘టాక్సిక్’ కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది
ABN, Publish Date - Aug 09 , 2026 | 11:52 AM
నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పనిచేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను.
'నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పనిచేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ‘టాక్సిక్’ కోసం కూడా అదే చేశాను. ఈ సినిమా కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఇది నా సినిమా కాదు.. ఇండియన్ సినిమా' అని యశ్ (Yash) అన్నారు. ఆయన హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను బెంగళూరులో గ్రాండ్‌గా విడుదల చేశారు.
ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ ‘టాక్సిక్’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది నా సినిమా అని నేను ఎప్పుడూ అనుకోను. ఇది ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరించాం. ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ప్యాషనేట్ డైరెక్టర్. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో అంకితభావంతో పని చేశారు. ‘టాక్సిక్’ కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గీతూ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు. ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. ఆ విషయంలో నిర్మాత వెంకట్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. దాదాపు 200 రోజుల పాటు రెండు భాషల్లో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో పనిచేసిన స్టార్స్ అందరూ తమ సమయాన్ని ఈ సినిమా కోసం డెడికేట్ చేశారు. ఈ సినిమాను ఎంత భారీ స్థాయిలో నిర్మించారో ట్రైలర్‌లోనే కనిపిస్తుంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను. ఆ లుక్స్ కోసం చాలా సమయం అవసరమైంది. నేను సినిమా కోసం కేటాయించిన మొత్తం సమయాన్ని రాధిక చాలా బాగా మేనేజ్ చేసింది. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసింది. నా భార్య రాధికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. తన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు' అని అన్నారు.
కథానాయికల గురించి మాట్లాడుతూ 'నయనతార చాలా గ్రేస్‌ఫుల్‌గా ఈ సినిమాలో నటించారు. ఆమె లేడీ సూపర్‌స్టార్. ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఇంకా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అందరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. తారా, హుమా కూడా చాలా అద్భుతంగా నటించారు. కియారా ఈ సినిమాను చాలా బాగా అర్థం చేసుకుని పనిచేశారు. ఆమె పాత్రను ప్రేక్షకులు కచ్చితంగా అభినందిస్తారని నేను నమ్ముతున్నాను' అని అన్నారు.