సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Panjaka: ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల లఘు చిత్రం..

ABN, Publish Date - Nov 28 , 2026 | 11:00 AM

తెలుగమ్మాయిలు అనూయ స్వామి, హర్షిణి బోయళ్ల రూపొందించిన ‘పంకజ’ కన్నడ–తెలుగు లఘు చిత్రం ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించింది.

తెలుగమ్మాయిలు అనూయ స్వామి(Anooya swami), హర్షిణి బోయళ్ల (harshini Boyalla) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు అందుకున్నారు. వీరిద్దరూ కలిసి పనిచేసిన ‘పంకజ’ (Pankaja) అనే కన్నడ–తెలుగు లఘు చిత్రం ఆస్కార్ అవార్డుల (oscar awards)పరిశీలనకు అర్హత సాధించింది. ఒక చిన్న కథతో మొదలైన ఈ ప్రయాణం అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందడం విశేషం. ‘పంకజ’ చిత్రానికి అనూయ స్వామి దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. హర్షిణి బోయళ్ల ప్రధాన పాత్రను పోషించారు. వీరిద్దరూ బెంగళూరులో పుట్టి పెరిగినవారే. ఓ మురికివాడలో నివసించే కుటుంబాల జీవితాలు, వారి చుట్టూ ఉండే పరిస్థితుల నేపథ్యంలో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. సామాజిక అంశాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

అంతర్జాతీయ స్థాయిలోనూ ‘పంకజ’ తనదైన ముద్ర వేసింది. ప్రతిష్ఠాత్మక సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు 40కి పైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అంతేకాకుండా రెయిన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విజేతగా నిలవడం ఈ చిత్రానికి మరో ప్రత్యేక గుర్తింపు. ఈ విజయాల నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించడం చిత్ర బృందానికి గర్వకారణంగా మారింది.

ఇక భారతీయ చిత్రాల విషయానికొస్తే.. ఇప్పటికే ‘అంష్’, ‘గోందల్’ చిత్రాలు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో ఆస్కార్ పరిశీలనకు ఎంపికయ్యాయి. మరోవైపు ‘రామాయణం’ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పరిశీలనకు ఎంపిక చేసిన 20 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ‘పంకజ’కు లభించిన గుర్తింపు కూడా భారతీయ సినీ పరిశ్రమకు మరో విశేషంగా నిలుస్తోంది. ప్రాంతీయ భాషల్లో రూపొందిన చిన్న చిత్రాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలవని అనూయ, హర్షిణి నిరూపించారు. ఈ లఘు చిత్రానికి  మరింత ప్రచారం చేయడానికి  హాలీవుడ్‌ నటులు విలియం డఫో, స్పైక్‌ లీ, ఆస్కార్‌ విజేత గునీత్‌ మోంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించడానికి ముందుకు వచ్చారు.

Updated Date - Nov 28 , 2026 | 11:01 AM