Darshan: నాలుగు నెలలు ధైర్యంగా ఉండు.. జైలులో దర్శన్, పవిత్ర పలకరింపులు! ఇంకా.. ఏం మాట్లాడుకున్నారంటే?
ABN, Publish Date - Nov 13 , 2026 | 05:40 AM
రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న దర్శన్, పవిత్రాగౌడ వీడియో కాన్ఫరెన్స్ విచారణ సందర్భంగా మాట్లాడుకున్నారు.
చిత్రదుర్గ రేణుకాస్వామి (Renukaswamy Murder Case) హత్య కేసులో జైలు పాలైన ఎ-1 పవిత్రాగౌడ (Pavithra Gowda) , ఎ-2 నటుడు దర్శన్ (Darshan) పరస్పరం పలకరించుకుని యోగక్షేమాలు మాట్లాడుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు దర్శన్, పవిత్ర పరప్పన అగ్రహార జైలు (Parappana Agrahara Jail) నుంచి పాల్గొన్నారు.
ఇంకా విచారణ ప్రారంభం కాకపోవడం ఇదే సందర్భంలోనే దర్శన్, పవిత్ర చూసుకున్నారు. అంతలోనే దర్శన్‌ను పవిత్ర పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉంది. వెన్నునొప్పి తీవ్రంగా ఉందా, చికిత్స ఏం చేస్తున్నారు అని అడిగారు. అందుకు దర్శన్ నొప్పి తీవ్రంగా ఉందని, ఫిజియోథెరపీ చేస్తున్నారని అన్నారు. ఒక సెషన్ జరిగిందని, ఇంకా కొనసాగిస్తారని, నడుం విరిగినంతగా నొప్పిగా ఉందని అన్నారు.
ఇంకా ఎంతకాలం జైలులో ఉండాలని పవిత్ర అడుగగా, అందుకు దర్శన్ మరో 4-5 నెలలు ధైర్యంగా ఉండు అని సూచించారు. జైలులో ఉండటం తనవల్ల కావడంలేదని, నరకం చూస్తున్నానని పవిత్ర అన్నారు. 'మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండు. మనసును గట్టిచేసుకో అని దర్శన్ సూచించినట్లు సమాచారం. అంతలోనే వీడియో కట్ కాగా, కాసేపటి తర్వాత తిరిగి వీడియో అన్ కాగానే ఇద్దరూ మౌనంగా కనిపించినట్లు సమాచారం.