Toxic: కెవిఎన్ ప్రొడక్షన్స్ పరిస్థితేమిటో!?
ABN , Publish Date - Aug 26 , 2026 | 01:56 PM
ఈ యేడాది కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి ఇప్పటికి వరకూ ఐదు సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదలైన సినిమాలలో ఏదీ లాభాలను తెచ్చిపెట్టక పోగా మూడు చిత్రాలు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయని ట్రేడ్ టాక్!
ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ భవిష్యత్తు గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ప్రముఖ నిర్మాత వెంకట్ కె నారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. సినిమాలకు ఫైనాన్స్ చేయడంతో పాటు పంపిణీ చేయడంతో ఆగకుండా, నిదానంగా చిత్ర నిర్మాణంలోకి ఆయన అడుగు పెట్టారు. 2021లో 'సకత్', 2022లో 'బై టూ లవ్' చిత్రాలను నిర్మించారు. అయితే ఇవేవీ ఆశించిన స్థాయిలో గొప్ప విజయాలను సొంతం చేసుకోలేదు. దాంతో పక్కా ప్లానింగ్‌తో వెంకట్ కె. నారాయణ ఇప్పుడు తన చిత్ర నిర్మాణాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి కూడా విస్తరించారు. ఈ యేడాది అలా ఆయన ఇప్పటికే పలు భాషా చిత్రాలను నిర్మించి విడుదల చేశారు.
2026లో ఇప్పటి వరకూ ఈ సంస్థ నిర్మించిన ఐదు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. జనవరిలో కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'కల్ట్' మూవీ విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపించలేదు. అదే నెలలో పొంగల్ కానుకగా విడుదల కావాల్సిన 'జన నాయగన్' సెన్సార్ కారణంగా వాయిదా పడింది. దాంతో కన్నడలోనే తీసిన 'కెడి: ద డెవిల్' చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఏప్రిల్ 30న విడుదల చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇదే సంస్థ మలయాళంలో తీసిన 'బాలన్' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కొన్ని విదేశీ చిత్రోత్సవాలలో అవార్డులనూ గెలుచుకుంది. అయితే థియేటర్లలో మాత్రం 'బాలన్' తగినంత లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. ఈ సినిమా జూన్ 19న విడుదలైంది.
ఇక పొంగల్ కు రావాల్సిన 'జన నాయగన్' మూవీ జులై 23న విడుదలైంది కానీ భారీ నష్టాలను చవిచూసింది. విజయ్ సీఎం అయిన తర్వాత వచ్చిన 'జన నాయగన్' జనాలను మెప్పించ లేకపోయింది. అయితే ఇదే సమయంలో వెంకట్ నారాయణను తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా దేశ రాజధాని ఢిల్లీలో నియమించి, ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు విజయ్.
ఇదిలా ఉంటే యశ్ తో కలిసి వెంకట్ నారాయణ నిర్మించిన భారీ చిత్రం 'టాక్సిక్' బుధవారం జనం ముందుకొచ్చింది. అంబారాన్ని తాకే అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలానే యూత్‌ను అట్రాక్ట్ చేసే అంశాలు సైతం ఇందులో లేవంటున్నారు. ఈ రకంగా ఈ యేడాది ఈ సంస్థ నుంచి వచ్చిన ఐదు చిత్రాలు నష్టాలు తెచ్చిపెట్టాయి తప్పితే... ఎలాంటి లాభాలను అందించలేకపోయాయి.
దాంతో ఇప్పుడు సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉన్న హిందీ సినిమా 'హైవాన్'తో పాటు అక్టోబర్‌లో రిలీజ్ అవుతున్న కన్నడ చిత్రం 'బెయిల్' పైనే నిర్మాత ఆశలు పెట్టుకున్నారు. హిందీ సినిమాను ప్రియదర్శన్ తెరకెక్కిస్తుంటే, కన్నడ చిత్రంలో శివ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు వెంకట్ నారాయణ తెలుగులో చిరంజీవితో 'కాకా' మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.
మొత్తం మీద ఒకే యేడాది ఆరేడు సినిమాలను నిర్మించడం, అవేవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ నిర్మాణ సంస్థ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా రంగంలో జయాపజయాలు సర్వసాధారణం. పైగా కెవిఎన్ ప్రొడక్షన్స్ కేవలం చిత్ర నిర్మాణంలోనే కాకుండా వివిధ వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉంది. సో... ఈ ఒత్తిడులను తట్టుకుని ముందుకు సాగుతుందని మరికొందరు నమ్మకంగా చెబుతున్నారు. చూడాలి... ఏం జరుగుతుందో!
ఇవి కూడా చదవండి:
Toxic: గ్యాంగ్ స్టర్ డ్రామా 'టాక్సిక్' రివ్యూ
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్
2.5 కోట్లతో భారతీరాజా స్మారక మండపం.. సీఎం విజయ్‌పై ప్రశంసలు