పుష్ప జాలిరెడ్డి కొడుకు పేరు తెలుసా.. కన్నడ సంప్రదాయం ఉట్టిపడేలా పెట్టాడే
ABN, Publish Date - Sep 14 , 2026 | 03:53 PM
కన్నడ నటుడు డాలీ ధనంజయ్ (Daali Dhananjay) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాలో జాలీ రెడ్డి పాత్ర ద్వారా తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు.
కన్నడ నటుడు డాలీ ధనంజయ్ (Daali Dhananjay) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాలో జాలీ రెడ్డి పాత్ర ద్వారా తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు. ఆ తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తుంది. ఇక గతేడాది ధనంజయ్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించిన డాక్టర్ ధన్యతను వివాహమాడాడు. ఈ జంటకు ఈ ఏడాదిలోనే ఒక బాబు కూడా జన్మించాడు. తాజాగా ఈ దంపతులు తమ కుమారుడి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించి, బాబుకు ఎరెయ (Ereya) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఇక ఈ పేరు వెనుక ఉన్న కన్నడ భాషా సంప్రదాయం అసలు అర్థాన్ని ధనంజయ్ కుటుంబం అధికారికంగా వెల్లడించింది. పురాతన కన్నడ సాహిత్యం ప్రకారం ఎరెయ అంటే ఒడెయ, స్వామి, అధిపతి అని అర్థం. పూర్వకాలంలో రాజులను, దేశాన్ని ఏలే పాలకులను ఎంతో గౌరవంతో సంబోధించడానికి ఈ ఎరెయ అనే పదాన్ని ఉపయోగించేవారు. అంతేకాకుండా చాళుక్య చక్రవర్తి ఇమ్మడి పులకేశి చిన్ననాటి పేరు కావడం కూడా విశేషం. పాలకుడు అనే రాజసంతో కూడిన గౌరవప్రదమైన అర్థం ఉండటంతో ధనంజయ్ కుటుంబం ఈ పేరును తమ వారసుడికి ఖరారు చేసింది. కన్నడ పురాతన సంస్కృతి, చరిత్రలో రూట్స్ ఉన్న ఈ పేరు పెట్టడంతో డాలీ ధనంజయ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది.
మామూలుగా సెలబ్రిటీలు ఈ రోజుల్లో ట్రెండీగా ఉండే మోడరన్ పేర్ల వైపు మొగ్గు చూపుతుంటే, ధనంజయ్ మాత్రం తమ ప్రాంతీయ మాతృభాషలోని గొప్పదనాన్ని, ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే పేరును ఎంచుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయం, చారిత్రక ప్రాధాన్యత కలగలిపిన ఈ రాయల్ నేమ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం డాలీ ధనంజయ్ పర్సనల్ లైఫ్‌లో తండ్రిగా ఈ కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తూనే, ప్రొఫెషనల్‌గా పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కన్నడతో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉన్న ధనంజయ్ ఇంటికి కొడుకు ఎరెయ రాకతో ఆయన కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.