టాక్సిక్ పై విరుచుకుపడిన మాజీ బీజేపీ నేత అన్నామలై
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:05 PM
'టాక్సిక్' సినిమాలోని సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ మాజీ నేత అన్నామలై అభిప్రాయపడ్డారు. సెన్సార్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆయన కోరారు.
యశ్ ద్విపాత్రాభినయం చేసిన 'టాక్సిక్' సినిమా బుధవారం విడుదలైంది. ఈ మూవీపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అయినా దీనిపై ఉన్న క్రేజ్ కారణంగా తొలిరోజున 'టాక్సిక్' వంద కోట్ల గ్రాస్‌ను వసులూ చేసింది. 'టాక్సిక్'కు ఆశించిన స్థాయిలో కలక్షన్స్ లేకపోవడంతో మొదటి రోజు సెకండ్ షో నుంచి తెలుగు రాష్ట్రాలలోని చాలా థియేటర్లలో 'ఇరుముడి' సినిమాను ప్రదర్శించడం ప్రారంభించారు.
భారీ అంచనాలతో విడుదలైన 'టాక్సిక్'కు ఫస్ట్ డేనే నెగెటివ్ టాక్ రావడం, థియేటర్ల నుంచి సినిమా ఎత్తేయడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. దీనిపై బీజేపీ మాజీ నేత, అన్నామలై స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్న ఈ సినిమాను ఏ రకంగానూ ఎంకరేజ్ చేయకూడదని అన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళి స్త్రీని గౌరవించాలని చెబుతుంటామని, కానీ ఇలాంటి చిత్రాల ద్వారా పిల్లల మనసులు కలుషితం చేస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా చిత్రాలకు సెన్సార్ సర్టిఫికెట్ ను ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. సెన్సార్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, పెద్ద హీరోల సినిమాలైనా సరే ఏది ఆమోదించాలి, ఏది ఆమోదించకూడదనే విషయంలో దృఢమైన నిర్ణయాలను సభ్యులు తీసుకోవాలని అన్నామలై అన్నారు. 'టాక్సిక్'లో మహిళలను కించపరిచే సన్నివేశాలు అనేకం ఉన్నాయని, ఇలాంటి సినిమాలను పిల్లలకు చూపిస్తే... దేశంలోని మహిళల పరిస్థితి ఏమవుతుంది?' అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో కమ్ ప్రొడ్యూసర్ యశ్ మాట్లాడుతూ, 'ఎవరికైనా వారు చేసే పనివల్ల గౌరవం వస్తుంది తప్పితే డబ్బు వల్ల రాద'ని అన్నారు. 'ప్రతి మహిళ తన ఆలోచనలను వ్యక్తపరిచి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని, విజయసాధించాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. 'ట్రైలర్ లో కనిపించినట్టుగా ఈ సినిమా ఉండద'ని యశ్ హామీ ఇచ్చారు. కానీ 'టాక్సిక్' మూవీ చూసిన వారు దారుణంగా విమర్శిస్తున్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి దిల్ రాజు Vs మైత్రీ! ఈసారి ఏమయ్యేనో
Varun Tej: 'బరి’ పై వరుణ్ తేజ్ ఫోకస్.. ఈసారి గెలుపే టార్గెట్!