Jana nayagan: మరోసారి.. విచారణ జరపాల్సిందే
ABN, Publish Date - Jan 27 , 2026 | 02:16 PM
విజయ్ (Vijay) కథానాయకుడిగా హెచ్. వినోద్ (H Vinod) దర్శకత్వంలో రూపొందుతున్న ‘జన నాయగన్’కు (Jana Nayagan) మరో సమస్య వచ్చిపడింది.
విజయ్ (Vijay) కథానాయకుడిగా హెచ్. వినోద్ (H Vinod) దర్శకత్వంలో రూపొందుతున్న ‘జన నాయగన్’కు (Jana Nayagan) మరో సమస్య వచ్చిపడింది. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు ఆ తీర్పును మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. సెన్సార్ బోర్డుకు తన వాదనలు వినిపించడానికి న్యాయపరమైన అవకాశాన్ని ఇవ్వాలని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైనదా కాదా.. అనే అంశాన్ని సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన విధంగా మరోసారి విచారణ చేసి ఆదేశాలు జారీ చేసే అధికారం సింగిల్ బెంచ్‌కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
‘జన నాయగన్’కు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు తీసుకున్న కోర్టు సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం, మద్రాసు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. మరోమారు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని మంగళవారం సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది.