జైలర్ 2 వాయిదా.. సీఎం విజయే కారణం
ABN, Publish Date - Sep 01 , 2026 | 08:26 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారి రణబాలి లేదా వెంకటేష్ ఆదర్శ కుటుంబం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ నోరువిప్పాల్సిందే.