సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మ్యూజిక్ మాస్ట్రో సంగీతానికి యాభై ఏళ్ళు..

ABN, Publish Date - May 15 , 2026 | 06:53 PM

తన స్వరకల్పనతో యావద్భారతాన్నీ ఆనంద డోలికల్లో ఊగించారు ఇళయరాజా (Ilaiyaraaja). సంగీత దర్శకునిగా ఇళయరాజా ప్రస్థానం యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది.

Ilaiyaraaja

తన స్వరకల్పనతో యావద్భారతాన్నీ ఆనంద డోలికల్లో ఊగించారు ఇళయరాజా (Ilaiyaraaja). సంగీత దర్శకునిగా ఇళయరాజా ప్రస్థానం యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంగీతజ్ఞాని అందించిన మధురాన్ని మననం చేసుకుందాం.

ప్రస్తుతం ఇళయరాజా వయసు 82 సంవత్సరాలు... సంగీత దర్శకునిగా ఆయన వయసు 50 ఏళ్ళు. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన తొలి చిత్రం 'అన్నక్కిళి' విడుదలై యాభై ఏళ్ళయింది. అదే సినిమాను తెలుగులో 'రామచిలక'గా రీమేక్ చేశారు. సంగీత దర్శకుడు సత్యం - ఇళయరాజా బాణీలనే ఉపయోగించారు. 1977లో ఇళయరాజా బాణీల్లో తొలి తెలుగు చిత్రంగా 'భద్రకాళి' రూపొందింది. తొలి సినిమాతోనే తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నారు రాజా. తరువాత కొన్ని తెలుగు సినిమాలకు ఇళయరాజా బాణీలు సమకూర్చినా, యన్టీఆర్ 'యుగంధర్'తో తెలుగునాట ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించారు రాజా... ఎందుకంటే ఈ సినిమాకు హిందీ చిత్రం 'డాన్' ఆధారం... అందులో కళ్యాణ్ జీ- ఆనంద్ జీ బాణీలు యావద్భారతాన్నీ ఆకట్టుకున్నాయి... తెలుగులో ఇళయరాజా తన ప్రత్యేకతను చాటుకుంటూ 'యుగంధర్'కు స్వరాలు కూర్చి జనాన్ని మురిపించారు... అలా ఇళయరాజా పేరు మారుమోగి పోయింది.


తమిళనాట ఎందరో యంగ్ హీరోస్ చిత్రాలకు ఇళయరాజా బాణీలు ప్రాణం పోశాయి. కమల్ హాసన్, రజనీకాంత్ సూపర్ స్టార్స్ గా వెలగడంలో ఇళయరాజా సంగీతం పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఇళయరాజా స్వరకల్పన సంగీతప్రియులను పరవశింప చేసింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ చిత్రాలకు ఇళయరాజా సమకూర్చిన స్వరాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యండమూరి నవలాచిత్రాలకు ఇళయరాజా సమకూర్చిన సంగీతాన్ని తెలుగువారు ఎన్నటికీ మరచిపోలేరు. ఆ పాటలు ఈ నాటికీ సంగీతాభిమానులను మైమరపిస్తూనే ఉండడం విశేషం.


ఇళయరాజాను తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిపింది తెలుగు చిత్రం 'సాగరసంగమం'... తరువాత 'రుద్రవీణ' తెలుగు సినిమాతోనూ ఇళయరాజాకు నేషనల్ అవార్డు లభించింది... 'సింధుభైరవి' తమిళ సినిమాతోనూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న ఇళయరాజా తరువాత "పళస్సీ రాజా, తారై తప్పట్టై" చిత్రాల ద్వారా ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న రాజా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఈ నాటికీ తన దరికి చేరిన చిత్రాలకు ఇళయరాజా స్వరకల్పన చేస్తున్నారు... యాభై ఏళ్ళుగా అలరిస్తూనే ఉన్న ఇళయరాజా మునుముందు కూడా తన స్వరకల్పనతో అలరిస్తారని ఆశిద్దాం.

Updated Date - May 15 , 2026 | 06:57 PM