Toxic: హీరోని ఒకలా.. హీరోయిన్‌ను మరోలా చూస్తారా
ABN, Publish Date - Aug 03 , 2026 | 12:56 PM
'టాక్సిక్' చిత్రంలోని 'తబాహీ' పాటపై వచ్చిన వివాదానికి హుమా ఖురేషి ఘాటుగా స్పందించారు.
యశ్ (Yash) హీరోగా గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic) విడుదలకు ముందు నుంచే తీవ్ర విమర్శలు, నెగిటివీటి ఎదురుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రతీ ప్రమోషన్ కంటెంట్ టీజర్, ట్రైలర్, పాటుల ఇలా అన్నీ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన 'తబాహీ' ప్రమోషనల్ సాంగ్ సైతం అదే బాటలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వివాదాన్నీ తెచ్చిపెట్టింది. ఈ పాటలో యశ్, కియారా అద్వానీ (Kiara Advani) మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వివాహిత అయిన కియారా అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. కొందరు ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాను కూడా ఈ వివాదంలోకి లాగుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇదే అంశంలో చాలామంది ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. యశ్ కూడా వివాహితుడే, ఇద్దరు పిల్లలకు తండ్రి. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి ప్రశ్నలు, విమర్శలు లేవనెత్తకుండా, కేవలం కియారానే లక్ష్యంగా చేసుకోవడం వెనక వారి మానసిక స్థితి ఎలాంటిదో అర్థం అవుతుందని ఘాటుగానే స్పందించారు. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ నటి హుమా ఖురేషి మాట్లాడుతూ.. మహిళలపై మాత్రమే ఇలాంటి విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. నటన అనేది వ్యక్తిగత జీవితం కాదని, పాత్రకు అవసరమైన మేరకు నటించడం ప్రతి కళాకారుడి వృత్తిలో భాగమేనని చెప్పారు."ఇలాంటి విమర్శలకు ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తే అదే మా సమాధానం అవుతుంది" అని హుమా ఖురేషి పేర్కొన్నారు.
ఈ అంశంపై నటుడు సాకిబ్ సలీమ్, బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా కియారా అద్వానీకి మద్దతు తెలిపారు. ఒకే పరిస్థితిలో హీరోను ఒకలా, హీరోయిన్‌ను మరోలా చూడటం సమాజంలో ఇంకా లింగ వివక్ష కొనసాగుతోందనే విషయాన్ని గుర్తు చేస్తోందని వారు అభిప్రాయపడ్డారు. భారీ బడ్జెట్‌తో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ 'టాక్సిక్' చిత్రంలో యశ్, కియారా అద్వానీతో పాటు నయనతార, హుమా ఖురేషి (Huma Qureshi), తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో అంచనాలు ఉన్న ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.