Vishal: హ్యాట్యాప్ విజయ్.. మీ నిర్ణయం అద్భుతం! మీకు సెల్యూట్ చేస్తున్నా
ABN, Publish Date - May 12 , 2026 | 04:23 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆరంభంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ (Vijay) ఆరంభంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధికార బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్దనున్న 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ విజయ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దుకాణాలను మూసేయాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎంగా ఆయన జారీ చేసిన తొలి ఉత్తర్వు ఇదే కావడం విశేషం.
సీఎం హోదాలో విజయ్ తీసుకున్న నిర్ణయంపై కాలేజీ రోజుల నుంచి ఆయన సన్నిహిత స్నేహితుడిగా పేరున్న నటుడు విశాల్ ప్రశంసలు కురిపించారు. తనదైన శైలిలో విజిల్ వేస్తూ 'విజిల్స్ టూ యూ' అంటూ ఒక వీడియోను విడుదల చేశారు. విజయ్ పార్టీ గుర్తు కూడా విజిల్ కావడం మరో విశేషం.
'మీకు అభినందనలు, విజిల్స్ టూయా, హ్యాట్యాప్ టూ యూ విజయ్. 717 మద్యం దుకాణాలను ముఖ్యంగా పాఠశాలలకు సమీపంలోని ఉన్న వాటిని మూసివేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం, అద్భుతం. టాస్మాక్ షాపుల వల్ల ప్రతిరోజూ విద్యార్థినులు ఆ దుకాణాలు దాటి ఇంటికి చేరుకునేటప్పుడు వేధింపులకు గురవుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మీకు, మీ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నాను' అని ఆ వీడియోలో విశాల్ ప్రశంసలు కురిపించారు.