బ్యూటిఫుల్ మెసేజ్ తో హ్యాపీ రాజ్!
ABN, Publish Date - Mar 20 , 2026 | 08:29 PM
జీవీ ప్రకాశ్ కుమార్, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన 'హ్యాపీ రాజా' సినిమా మార్చి 27న తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
స్టార్ కంపోజర్, హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ శిష్యుడు మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జైవర్థ నిర్మించిన ఈ సినిమాలో'మ్యాడ్' ఫేం శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో జీవి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, 'ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని సోషల్ మీడియాలో లాంచ్ చేసిన రవితేజ గారికి థాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను చూశారు. వాళ్లకి చాలా నచ్చింది. వారి ద్వారా ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఫన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. మీరందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మన అందరి జీవితాల్లో నాన్న బిగ్గెస్ట్ హీరో. ఈ సినిమా చూసిన తర్వాత ఫాదర్‌ని సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది' అని అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ, 'జీవీ గారి మ్యూజిక్ కంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్‌గా 'ఇరుముడి' సినిమాకి ఆయనతో వర్క్ చేయడం కుదిరింది. మ్యూజిక్ వర్క్ అంత అద్భుతంగా జరుగుతోంది. తనని మ్యూజిక్ డైరెక్టర్‌గా కలిసి, ఇప్పుడు హీరోగా తన ఈవెంట్‌కి రావడం చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. ఆయన సినిమాకి మ్యూజిక్ చేసినా, నటించినా ప్రాణం పెట్టి చేస్తారు. హీరోగా దాదాపు 20 సినిమాలు చేశారు. ఇప్పుడు 'హ్యాపీ రాజ్'తో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తమిళ్ నుంచి వచ్చిన ప్రతి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెలుగులో అద్భుతంగా ఆడుతోంది. మంచి సినిమా ఎక్కడున్నా మైత్రి మూవీ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గౌరీ ప్రియ ఈ మధ్యకాలంలో చాలా మంచి పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. టైటిల్‌లో ఉండే హ్యాపీనెస్ ప్రేక్షకులు కూడా కలగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్ అయిన తర్వాత డైరెక్టర్ తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గౌరీ తెలుగు అమ్మాయి. తను ఇక్కడ ఇక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లి అక్కడ అవార్డు అందుకోవడం చాలా గొప్ప విషయం. జీవీ నా ఫ్రెండ్. మా జర్నీ 'సార్'తో మొదలైంది. రాబోయే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీకీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించి జీవి ఇప్పుడు తీసుకుంటున్నా రెమ్యూనికేషన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. తాను నటించిన తమిళ చిత్రం తన మాతృభాష అయిన తెలుగులోనూ సేమ్ డే రిలీజ్ కావడం ఆనందంగా ఉందని శ్రీ గౌరి ప్రియ హర్షం వ్యక్తం చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రులను చూసే దృష్టికోణం మారుతుందని, మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ మొదట నవీన్ పోలిశెట్టికి పంపానని, ఆయనకు బాగా నచ్చిందని, ఆయన ప్రోత్సాహంతోనే జీవీ ప్రకాశ్ ను అప్రోచ్ అయ్యానని దర్శకుడు మరియా రాజా చెప్పారు. తన గురువు ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే'లో ఉన్న ఎనర్జీ ఈ సినిమాలోనూ ఉంటుందని రాజా తెలిపారు. జీవీ ప్రకాశ్ యాక్టింగ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుందని నిర్మాత జైవర్థ చెప్పారు.